బుల్లితెర రియాలిటీ షో బిగ్ బాస్ తెలుగు, తమిళ భాషల్లో మూడో సీజన్ కోసం సిద్ధమవుతోంది. ప్రముఖ నటుడు కమల్ హాసన్ తమిళ బిగ్ బాస్ షోని హోస్ట్ చేయబోతున్నారు. రేపటి నుండే ఈ గేమ్ షో మొదలుకానుంది. ఇందులో పదిహేను మంది సభ్యులు పాల్గొంటారు.

ఇప్పటివరకు ఆ సెలబ్రిటీలు ఎవరనే విషయాన్ని గోప్యంగా ఉంచారు. అయితే రియాలిటీ షోలో పాల్గొనేవారు వీరే అంటూ ఒక లిస్ట్ సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. ఆ లిస్ట్ పై ఓ లుక్కేస్తే.. ఇటీవల సినీ, రాజకీయ నాయకులపై సంచలన వ్యాఖ్యలు చేస్తూ వార్తల్లో ఉంటోన్న నటి కస్తూరి, వివాదాలకు కేరాఫ్ అడ్రెస్ అయిన సీనియర్ నటుడు రాధారవి ఈ లిస్ట్ లో ప్రముఖంగా కనిపిస్తున్నారు.

వీరితో పాటు నటుడు సంగీత దర్శకుడు ప్రేమ్ జీ, నటి విచిత్ర, పూనమ్ బాజ్వా, చాందిని, హాస్యనటి మధుమిత, నటుడు మోహన్ వైద్య, శక్తి చరణ్, సంతానభారతీ, శ్రీమాన్, రమేష్ తిలక్, మృణాలిని, మోడల్ శ్రీగోపిక, విజయ్ టీవీ రమ్య, గాయకుడు క్రిష్ మొదలగు వారు పాల్గొంటున్నారని ప్రచారం జరుగుతోంది.

అయితే దీనిపై ఎలాంటి అధికార ప్రకటన లేదు. రేపటి షోలో ఈ విషయంపై క్లారిటీ రానుంది.