సినిమా అనేది ఓ మాయా ప్రపంచం. ఇక్కడ ఒక్కసారి బ్రేక్‌ వస్తే వద్దన్నా అవకాశాలు వస్తాయి. కానీ గుర్తింపు వచ్చేంత వరకు స్ట్రగుల్‌ మాత్రం తప్పదు. ఎంతోమంది సినిమాలపై ఆసక్తితో చిత్ర పరిశ్రమకి వస్తారు. అవకాశాలు రాక ఇబ్బంది పడుతుంటారు. తిరిగి ఇంటికెళ్ల లేక, ఇక్కడే జీవనం సాగించలేక నానా తంటాలు పడుతుంటారు. తాజాగా తమిళనాడులో ఇలాంటి పరిస్థితుల్లోనే ఓ విషాదం నెలకొంది. ఓ తమిళ నటుడు అవకాశాలు లేక, ఆర్థిక ఇబ్బందులు తట్టుకోలేక ఆటోలోనే కన్నుమూశాడు. 

ఇంతటి విషాదకర, హృదయ విదారక ఘటన చెన్నైలో చోటు చేసుకుంది. విరుత్చాగాకాంత్‌ బాబు అనే వ్యక్తి తమిళంలో పలు సినిమాల్లో చిన్న చిన్న పాత్రలు పోషించాడు. `ప్రేమిస్తే`లో ఓ చిన్న పాత్ర కూడా పోషించాడు. ఆ తర్వాత అతనికి పెద్దగా అవకాశాలు రాలేదు. దానికి తోడు అతని తల్లిదండ్రులు ఇటీవల మృతి చెందారు. దీంతో ఆర్థికంగా, మానసికంగా కృంగిపోయిన విరుత్చాగా కాంత్‌ బాబు కొద్ది రోజులుగా చెన్సైలోనే ఉంటున్నాడు. డబ్బుల్లేక రూమ్‌ కిరాయి కూడా కట్టలేని పరిస్థితి. దీంతో రోడ్డుపైనే, బస్టాండ్లలో ఉంటూ నివసిస్తున్నాడు. కనీసం తిండి కూడా దొరక్క చివరకు ఆటోలో నిద్రిస్తూ తనువు చాలించాడు. ప్రస్తుతం ఈ ఘటన యావత్‌ ప్రజానికాన్ని కలచివేస్తుంది.