ప్రముఖ తమిళ నటి శాలు షమును సోషల్ మీడియాలో సంచలన వ్యాఖ్యలు చేసింది. ఓ దర్శకుడు తనని సినిమా ఛాన్స్ పేరుతో వాడుకోవాలని ప్రయత్నించాడని పేర్కొంది. శాలు షము తమిళంలో కాంచీవరం, మయిలు లాంటి చిత్రాలతో గుర్తింపు సొంతం చేసుకుంది. శాలు షము ఇటీవల సోషల్ మీడియాలో నెటిజన్లతో మాట్లాడుతూ ఈ ఆసక్తికర వ్యాఖలు చేసింది. మీరెప్పుడైనా చిత్ర పరిశ్రమలో మీటూ సంఘటనలు ఎదుర్కొన్నారా అని ప్రశ్నించగా తనకు ఎదురైన ఘటనని వివరించింది. 

'కొన్ని రోజుల క్రితమే నాకు మీటూ సంఘటన ఎదురైంది. తనతో పడుకుంటే విజయ్ దేవరకొండ సినిమాలో ఛాన్స్ ఇస్తానని ఓ దర్శకుడు నన్ను అడిగాడు. అంతటితో అతడితో మాట్లాడటం ఆపేసి ఆ వ్యవహారానికి ఫుల్ స్టాప్ పెట్టేశాను. అతడిపైన ఫిర్యాదు చేయాలని అనుకోవడం లేదు. ఇలాంటి సంఘటనలు ఎదురనప్పుడు ఎలా హ్యాండిల్ చేయాలో, నన్ను నేను ఎలా రక్షించుకోవాలో నాకు బాగా తెలుసు' అని శాలు షము పేర్కొంది. 

ఒక వేళ ఆ దర్శకుడుపై నేను ఫిర్యాదు చేసినా ప్రయోజనం ఉంటుందా.. అవును నేనే అలా అడిగా అని అతడు ఒప్పుకుంటాడా ఏంటి అంటూ నెటిజన్లతో వ్యాఖ్యానించింది. ప్రస్తుతం శాలు షము వయసు 25 ఏళ్ళు. శాలు తమిళంలో నటిగా మంచి గుర్తింపు సొంతం చేసుకుంటోంది. విజయ్ సేతుపతి, శివకార్తికేయన్ లాంటి హీరోల చిత్రాల్లో శాలు నటించింది.