స్టార్ హీరోయిన్ గా చాలా కాలం నుంచి వెలుగుతున్న తమన్నా త్వరలో విలన్ గా కనిపించి అలరించనుంది.  టైమ్ అయ్యిపోయింది..కెరీర్ ఇక ముగిసినట్లే అనకున్న దశలో ఎఫ్ 2 హిట్ ఆమెకు బూస్ట్ ఇచ్చింది.దాంతో ప్రస్తుతం బ్రేకులు లేని బండిలా తమన్నా రయ్‌ రయ్‌మంటూ తమిళ,తెలుగు భాషల్లో  దూసుకెళ్తున్నారు. తెలుగులో  'సైరా నరసింహారెడ్డి’ సినిమాలతో బిజీగా ఉన్న ఈ మిల్కీ బ్యూటీ తాజాగా తమిళంలో ఓ సినిమాకు ఓకే చెప్పారు. సుందర్‌. సి దర్శకత్వంలో రూపొందనున్న ఈ సినిమాలో విశాల్‌ హీరో. ఇందులో తమన్నాది పూర్తి నెగిటివ్ పాత్ర. అసలు తమన్నాను అలాంటి పాత్రలో ఊహించం, ఒప్పించటమే సినిమాకు సగం సక్సెస్ అంటున్నారు తమిళ సిని జనం. 

తమన్నా మాట్లాడుతూ..‘‘చాలా ఎగ్జైజటింగ్‌గా ఉంది. నా కెరీర్‌ స్టార్టింగ్‌ నుంచి సుందర్‌ సార్‌ డైరెక్షన్‌లో వర్క్‌ చేయాలనుకుంటున్నాను. ఇప్పటికి కుదిరింది. పక్కా యాక్షన్‌ చిత్రమిది.అందులోనూ నేను నెగిటివ్ పాత్రలో కనిపిస్తాను. నిజ జీవితంలో ఎలా ఉంటానో అందుకు విరుద్దంగా ఈ సినిమాలో కనిపించబోతున్నాను, నా పాత్రలో గ్రే షేడ్స్ ఉంటాయి. మైండ్ గేమ్స్ ఆడే అమ్మాయిగా నేను తెరపై చెలరేగిపోతాను..హీరోకు నేను ఇచ్చే ట్విస్ట్ లకు దిమ్మతిరగాల్సిందే.. విశాల్‌తో సెకండ్‌ టైమ్‌ నటించనుండటం హ్యాపీ’’ అని తమన్నా పేర్కొన్నారని కోలీవుడ్‌ మీడియా చెబుతోంది.

 ఇంతకుముందు తమిళ సినిమా ‘కత్తి సండై’లో విశాల్, తమన్నా కలిసి నటించారు. ఈ సినిమా తెలుగులో ‘ఒక్కడొచ్చాడు’ పేరుతో రిలీజైంది. రీసెంట్ గా సుందర్‌. సి తెలుగు హిట్‌ ‘అత్తారింటికి దారేది’ తమిళ రీమేక్‌తో బిజీగా చేసారు. ఆ సినిమా  భాక్సాఫీస్ వద్ద డిజాస్టర్ అయ్యింది . అలాగే విశాల్‌ కూడా తెలుగు హిట్‌ ‘టెంపర్‌’ తమిళ రీమేక్‌ ‘అయోగ్య’ షూటింగ్‌తో బిజీగా ఉన్నారు.  ఈ ప్రాజెక్ట్స్‌ను కంప్లీట్‌ చేసిన తర్వాత విశాల్‌–తమన్నా –సుందర్‌. సి కాంబినేషన్‌ సినిమా స్టార్ట్‌ అవుతుంది.

ప్రస్తుతం  తమన్నా ‘క్వీన్‌’కి తెలుగు రీమేక్‌గా ఆమె నటించిన  ‘దటీజ్‌ మహాలక్ష్మి’, తమిళంలో చేసిన ‘కన్నే కలైమానే’ రిలీజ్‌కి రెడీగా ఉన్నాయి.   ఆమె డైరీ ఫుల్‌గా ఉంది. కన్నడ ‘కేజీఎఫ్‌’లో ఐటమ్‌ సాంగ్‌ చేసిన తమన్నా, తెలుగులో ‘సవ్యసాచి’లో కూడా ఓ ఐటమ్‌ సాంగ్‌ చేయనున్న సంగతి గుర్తుండే ఉంటుంది.