తెలంగాణ ప్రభుత్వం సినీ పరిశ్రమకు శుభవార్త చెప్పింది. చాలా రోజులుగా ఇండస్ట్రీ పెద్దలు, ప్రభుత్వం యంత్రాంగం మధ్య జరుగుతున్న చర్చలు ఫలించాయి. ఇప్పటికే పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలకు అనుమతించిన ప్రభుత్వం, తాజాగా షూటింగ్‌ కూడా అనుమతిస్తున్నట్టుగా సినిమాటోగ్రఫీ మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్ తెలిపారు. ప్రభుత్వ సూచలన మేరకు కోవిడ్ 19 రూల్స్‌ పాటిస్తూ.. సోసల్ డిస్టాన్స్‌, శానిటేషన్ లాంటివి క్రమం తప్పకుండా పాటిస్తూ షూటింగ్‌లు చేసుకోవచ్చని తెలిపారు. త్వరలోనే షూటింగ్‌ ఎప్పుడు ప్రారంభమయ్యేది డేట్‌ చెప్తామని చెప్పారు.

అయితే  ఈ సందర్భంగా బాలకృష్ణ చేసిన వ్యాఖ్యలపై కూడా తలసాని శ్రీనివాస్ యాదవ్‌ స్పదించారు. బాలకృష్ణను అలా ఎందుకు మాట్లాడారో కనుక్కుంటా అన్నారు తలసాని, అదే సమయంలో ఇండస్ట్రీలో యాక్టివ్‌గా ఉన్న వాళ్లను మాత్రమే పిలిచాం, అంతేగాని ఇండస్ట్రీ అందరినీ పిలిచి పెట్టిన మీటింగ్ కాదని ఆయన తెలిపారు. అదే సమయంలో బాలయ్య కామెంట్స్ ఇప్పుడు చెప్పినవి కాదని గతంలో ఎప్పటి వీడియోనో ఇప్పుడు ప్రచారం చేస్తున్నారన్న అభిప్రాయం కూడా వ్యక్తమైందని తెలిపారు. పూర్తి వివరాలు తెలిసిన తరువాత బాలయ్య కామెంట్స్‌ పై స్పందిస్తానని తలసాని తెలిపారు.

గురువారం ఉదయం సినిమా పరిశ్రమపై మెగాస్టార్ చిరంజీవి నాయకత్వంలోని సినీ పెద్దలు తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావుతో జరిపిన చర్చలపై నందమూరి హీరో, తెలుగుదేశం పార్టీ (టీడీపీ) ఎమ్మెల్యే బాలకృష్ణ సంచలన వ్యాఖ్యలు చేశారు. సినిమా షూటింగులు ఎలా, ఎప్పుడు జరపాలో తనను ఎవరైనా అడిగితే సలహాలు ఇస్తానని ఆయన చెప్పారు.ప్రభుత్వంతో చర్చలు జరుగుతున్నాయట అని ఆయన అన్నారు. తనను ఎవరూ ఏ సమావేశానికీ పిలువలేదని ఆయన చెప్పారు. సినీ సమావేశమని చెప్పి రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నారని ఆయన ఘాటుగా స్పందించారు.