ఒప్పుకున్న ప్రాజెక్ట్ నుండి ఆఖరి నిమిషంలో తనను తప్పించడంపై హీరోయిన్ తాప్సీ అసహనాన్ని వ్యక్తం చేసింది. సరికొత్త కథలను ఎన్నుకుంటూ నటిగా తన టాలెంట్ నిరూపిస్తోన్న తాప్సీ 1970లలో వచ్చిన 'పతి పత్నీ ఔర్ వో' సినిమా రీమేక్ లో నటించాల్సివుంది.

దర్శకుడు ఈ సినిమాకు సంబంధించిన కథని తాప్సీకి వివరించి ఆమె అంగీకారం పొందాడు. కానీ ఇప్పుడు తాప్సీని కాదని మరో హీరోయిన్ ని తెరపైకి తీసుకొచ్చారు. ఈ విషయంలో బాధ పడిన తాప్సీ మీడియా ముఖంగా సదరు దర్శకుడిని ప్రశ్నించింది.

ఆమె మాట్లాడుతూ.. ''ఈ సినిమా రీమేక్ కి దర్శకుడు మొదట నన్నే ఎన్నుకున్నారు. కథ నచ్చి ఓకే చెప్పాను. నేను చేస్తున్న సినిమాలన్నీ తొందరగా పూర్తి చేయాలని చెప్పారు. ఆయన చెప్పినట్లుగానే పూర్తి చేశాను. కానీ ఇప్పుడు నన్ను ప్రాజెక్ట్ లో నుండి తప్పించారు'' అంటూ ఆవేదన వ్యక్తం చేసింది.

ఈ విషయం తనను ఎంతగానో బాధిస్తుందని, సినిమా నుండి ఎందుకు తొలగించాల్సివచ్చిందో సమాధానం చెప్పాలని డిమాండ్ చేసింది. తనకు జరిగినట్లుగా భవిష్యత్తులో మరెవరికి జరగకూడదని కోరుకుంది.

సినిమాల ఎంపిక విషయంలో మరిన్ని జాగ్రత్తలు తీసుకుంటానని వెల్లడించింది. ముదస్సర్ అజీత్ డైరెక్ట్ చేస్తోన్న ఈ సినిమా ఫిబ్రవరి నుండి సెట్స్ పైకి వెళ్లనుంది.