ఈ మధ్యకాలంలో నటి తాప్సీ వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ వార్తల్లో నిలుస్తుంది. గతంలో దర్శకుడు రాఘవేంద్రరావుపై సంచలన ఆరోపణలు చేసిన తాప్సీ తాజాగా ఓ తెలుగు హీరోపై మండిపడింది. వివరాల్లోకి వెళితే.. తనకు ఓ తెలుగు సినిమా ఆఫర్ వచ్చిందని, స్టోరీ నచ్చడంతో ఓకే చెప్పానని, అడ్వాన్స్ కూడా తీసుకున్నాని చెప్పింది.

అయితే కొన్ని రోజులకు నిర్మాతలు మళ్లీ వచ్చి.. హీరోపైనే సినిమా బడ్జెట్ ఆధారపడి ఉంటుందని, అతడికి అంత మార్కెట్ లేదని, తనను రెమ్యునరేషన్ తగ్గించుకోమన్నారని చెప్పింది తాప్సీ. అంతా సెట్ అయిన తరువాత హీరో మార్కెట్ ఆధారంగా తన రెమ్యునరేషన్ తగ్గించుకోమని చెప్పడంతో తాప్సీ ఆగ్రహం వ్యక్తం చేసింది.

తన రేటు డిసైడ్ చేయడానికి ఆ హీరో ఎవరంటూ మండిపడిందట. హీరోకి మార్కెట్ లేదని తనని రెమ్యునరేషన్ తగ్గించుకోమని చెప్పడం ఎంతవరకు కరెక్ట్ అని ప్రశ్నించింది. ఆ విషయం తనను బాధపెట్టిందని, అప్పుడే హీరోలతో సంబంధం లేకుండా సినిమా చేయాలని, కథ మొత్తం తన చుట్టూనే తిరిగే స్క్రిప్ట్ లు ఎంచుకోవాలని నిర్ణయించుకున్నట్లు చెప్పింది.

ఇన్ని విషయాలు చెప్పిన తాప్సీ సదరు హీరో ఎవరనే విషయాన్ని మాత్రం వెల్లడించలేదు. అతడు తెలుగు హీరో అనే విషయం మాత్రం స్పష్టం చేసింది.