సాహో చిత్రం విడుదలై థియేటర్స్ లో సందడి చేస్తోంది. ఇక త్వరలో రిలీజ్ కాబోతున్న మరో భారీ చిత్రం మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న సైరా నరసింహారెడ్డి. అక్టోబర్ 2న ఈ చిత్రాన్ని సౌత్ ఇండియన్ అన్ని భాషలతో పాటు, హిందీలో కూడా గ్రాండ్ గా రిలీజ్ చేస్తున్నారు. ఇటీవల విడుదలైన టీజర్ సినిమాపై అంచనాలు పెంచింది. 

ఇక రిలీజ్ సందర్భంగా చిత్ర యూనిట్ నిర్వహించబోయే ప్రచార కార్యక్రమాలపై అందరి దృష్టి పడింది. సెప్టెంబర్ మూడవ వారంలో సైరా ప్రీరిలీజ్ ఈవెంట్ ని ఘనంగా నిర్వహించేందుకు మెగా కాంపౌండ్ సన్నాహకాలు చేసున్నట్లు వార్తలు వస్తున్నాయి. అధికారికంగా ప్రకటన రాలేదు కానీ.. సెప్టెంబర్ 15న నరసింహారెడ్డి సొంత జిల్లా కర్నూల్ నగరంలో సైరా ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించబోతున్నట్లు తెలుస్తోంది. 

చరిత్ర మరచిన తొలి తెలుగు స్వాతంత్ర సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవిత చరిత్ర ఆధారంగా సైరా చిత్రం తెరకెక్కుతోంది. రాంచరణ్ నిర్మాణంలో, సురేందర్ రెడ్డి దర్శకత్వంలో దాదాపు 200 కోట్ల భారీ బడ్జెట్ లో సైరా చిత్రాన్ని నిర్మించారు. నయనతార హీరోయిన్ గా నటించింది. 

ఈ చిత్రంలో బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్, విజయ్ సేతుపతి, తమన్నా, జగపతి బాబు, కిచ్చా సుదీప్ లాంటి స్టార్స్ అందరూ నటించారు. ఈ ప్రీరిలీజ్ ఈవెంట్ కు సూపర్ స్టార్ రజనీకాంత్ చీఫ్ గెస్ట్ గా హాజరు కాబోతున్నట్లు ప్రచారం జరుగుతున్నప్పటికీ అందులో క్లారిటీ లేదు. ఇక చిరంజీవి సోదరుడు పవన్ కళ్యాణ్ అతిథిగా ఈ ఈవెంట్ లో పాల్గొనబోతున్నట్లు సమాచారం. సైరా టీజర్ కు పవన్ వాయిస్ ఓవర్ అందించారు.