సైరా నరసింహారెడ్డి చిత్రం మరికొద్ది రోజుల్లో విడుదలకు సిద్ధం అవుతున్న నేపథ్యంలో నేడు(ఆదివారం) బిగ్గెస్ట్ ప్రీరిలీజ్ ఈవెంట్ కు సిదాం అవుతోంది. ఈ రోజు సాయంత్రం హైదరాబాద్ లోని ఎల్బీ స్టేడియంలో ప్రీరిలీజ్ ఈవెంట్ ని వైభవంగా నిర్వహించనున్నారు. ఈవెంట్ కోసం ఘనంగా ఏర్పాట్లు చేస్తున్నారు. 

ప్రీరిలీజ్ వేడుకకు పవన్ కళ్యాణ్, రాజమౌళి లాంటి సెలెబ్రిటీలు హాజరు కానుండడంతో అభిమానులు పండగ చేసుకుంటున్నారు. వేదికపై మెగాస్టార్ చిరంజీవి, పవన్ కళ్యాణ్, రాజమౌళి ఏం మాట్లాడతారనేదానిపై ఉత్కంఠ నెలకొని ఉంది. 

ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కిన ఈ చిత్ర ట్రైలర్, టీజర్ కు సూపర్ రెస్పాన్స్ వచ్చింది. ప్రీరిలీజ్ వేడుకలో దర్శకుడు సురేందర్ రెడ్డి చెప్పబోయే మరిన్ని విశేషాల కోసం అభిమానులు ఎదురుచూస్తున్నారు. రాంచరణ్ తన తండ్రి కోసం దాదాపు 250 కోట్ల బడ్జెట్ తో ఈ చిత్రాన్ని నిర్మించాడు. 

నయనతార చిరు సరసన హీరోయిన్ గా నటిస్తోంది. బిగ్ బి అమితాబ్ బచ్చన్, తమన్నా, జగపతి బాబు, కిచ్చా సుదీప్, విజయ్ సేతుపతి కీలక పాత్రల్లో నటిస్తున్నారు. కర్నూలు జిల్లాకు చెందిన ఉయ్యాలవాడ నరసింహారెడ్డి బ్రిటిష్ వారితో పోరాడిన తొలి తెలుగు వీరుడు. కానీ చరిత్రలో ఆయనకు సరైన గుర్తింపు లభించలేదు. సైరా చిత్రం ద్వారా నరసింహారెడ్డి గురించి అంతా తెలుసుకుంటున్నారు.