మెగాస్టార్ చిరంజీవి హీరోగా 'సైరా' మూవీ రిలీజ్ కు సిద్ధమౌతున్న సంగతి తెలిసిందే. ఈ మూవీని తెలుగుతో పాటు వివిధ భాషల్లో  విడుదల చేయనున్నారు. భారీ బడ్జెట్ తో రూపొందుతున్న  ఈ చిత్రం ప్రమోషన్ విషయంలో రామ్ చరణ్ అనేక జాగ్రత్తలు తీసుకుంటున్నారు. కేవలం తెలుగు రాష్ట్రాల్లోనే కాక దేశం మొత్తం మాట్లాడుకునేలా ప్రమోషన్ ఉండాలని భావిస్తున్నారు. అందుకు వేదికగా ట్రైలర్ రిలీజ్ ని ఎంచుకున్నట్లు సమాచారం. 

ఫిల్మ్ నగర్ వర్గాల నుంచి అందుతున్న సమాచారం మేరకు..ఖతార్ లోని దోహా వేదికగా వచ్చే నెల 15 మరియు 16 తేదీలలో జరగనున్న సౌత్ ఇండియా ఇంటర్నేషనల్ మూవీ అవార్డ్స్ (సైమా)వేదికపై ఈ చిత్ర ట్రైలర్ ని విడుదల చేయనున్నారని సమాచారం. హిందీతో పాటు సౌత్ లోని పలు భాషలలో విడుదల కానున్న సైరా మూవీ ట్రైలర్ ని ఇలాంటి అంతర్జాతీయ వేదిక ద్వారా ప్రమోట్ చేయడం సినిమాకు అనుకూలించే అంశమే అని చెప్తున్నారు. 

ఈ మూవీకి సంబంధించిన హిందీ వెర్షన్ డిస్ట్రిబ్యూషన్ హక్కులు భారీ రేటుకు అమ్ముడైనట్టుగా తెలుస్తోంది. 'కేజీఎఫ్' సినిమాను బాలీవుడ్లో సమర్థవంతంగా పంపిణీ చేసిన ఎక్సెల్ ఎంటర్టైన్మెంట్ సంస్థవారు 'సైరా' హిందీ వెర్షన్ డిస్ట్రిబ్యూషన్ హక్కులను సొంతం చేసుకున్నట్టు టాక్. మెగాస్టార్ చిరంజీవికి ఉన్న క్లేజ్ మరియు 'సైరా' మూవీలోని ప్రత్యేకతలను పరిగణనలోకి తీసుకుని ఈ సంస్థ ఫ్యాన్సీ రేటుతో హక్కులను పొందినట్టుగా టాక్.

చరణ్ నిర్మిస్తోన్న ఈ సినిమా ఇప్పటికే చాలా వరకూ షూటింగ్ పనులు పూర్తి చేసుకుంది. సురేందర్ రెడ్డి దర్శకత్వంలో రూపొందుతన్న 'సైరా' మూవీ అక్టోబర్ కల్లా అన్ని ఏర్పాట్లు పూర్తి చేసుకొని అక్టోబర్ 2న రిలీజ్ చేసే చేసందుకు ప్లాన్ చేస్తున్నారు.

కొణిదెల ప్రొడక్షన్ బ్యానర్ పై రామ్ చరణ్ నిర్మాతగా ,దర్శకుడు సురేందర్ రెడ్డి రూపొందిస్తున్న ఈ చిత్రంలో నయనతార హీరోయిన్ గా నటిస్తుండగా, జగపతిబాబు,విజయసేతుపతి,అమితాబ్,తమన్నా వంటి స్టార్ కాస్ట్ ఇతర ముఖ్యపాత్రాలలో నటిస్తున్నారు.