ఒకప్పుడు ఫ్యామిలీ హీరోగా మంచి గుర్తింపు తెచ్చుకున్న జగపతి డిఫరెంట్ క్యారెక్టర్స్ ఎన్నో చేశారు. అయితే కథానాయకుడిగా కంటే ఆయన ఎక్కువగా విలన్ గానే మంచి క్రేజ్ అందుకుంటున్నారు. రంగస్థలం నుంచి ఆయన స్థాయి మరో లెవెల్ కి పెరిగిందనే చెప్పాలి. గతంలో ఎప్పుడు లేని విధంగా ఈ మధ్య మరింత కొత్తగా ట్రై చేస్తున్నారు. 

సాఫ్ట్ గా కనిపించే జగ్గు బాయ్ ఇంత వైలెంట్ గా అన్నాడేంటి అనుకునేలా రీసెంట్ గా బసిరెడ్డి పాత్రతో ఆలోచింపజేశాడు. ఇక నెక్స్ట్ సైరాలో కూడా తన నటనతో చాలా పెద్ద సర్ ప్రైజ్ ఇస్తాడని తెలుస్తోంది. రీసెంట్ గా ఆ పాత్ర గురించి చెప్పిన జగపతి పెద్దగా వివరించలేదు గాని చిన్న హింట్ ఇచ్చేశాడు. నా పాత్ర ఊహించని విధంగా ఉంటుంది. నా గెటప్ - ఆహర్యం ఎక్స్ క్లూజివ్ గా  అదరగొట్టేస్తాయని చెబుతూ.. ఇంతకుమించి నా రోల్ ఏమిటన్నది చెప్పలేనని అన్నారు. 

అయితే గాసిప్స్ ప్రకారం ఆయన పాత్ర బాహుబలి కట్టప్ప తరహాలో ఉంటుందని టాక్ వస్తోంది. బాహుబలిని వెన్నుపోటు పొడిచినట్టుగా సైరాలో నరసింహారెడ్డిని జగ్గుది వెన్నుపోటు పొడిచే పాత్ర అని ఊహాగానాలు వ్యక్తమవుతున్నాయి. మరి అది ఎంతవరకు నిజమనేది తెలియాలంటే వచ్చే ఏడాది వరకు ఆగాల్సిందే. సురేందర్ రెడ్డి దర్శకత్వం వహిస్తున్న ఆ సినిమాను కొణిదెల ప్రొడక్షన్స్ పై రామ్ చరణ్ నిర్మిస్తున్నారు.