మెగాస్టార్ చిరంజీవి ప్రధాన పాత్రలో నటిస్తోన్న చిత్రం 'సై రా నరసింహారెడ్డి'. స్వాతంత్య్రం సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవిత చరిత్రతో ఈ సినిమాను రూపొందిస్తున్నారు.

సురేందర్ రెడ్డి డైరెక్ట్ చేస్తోన్న ఈ సినిమాను రామ్ చరణ్ నిర్మిస్తున్నారు. చాలా కాలంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమా రిలీజ్ డేట్ విషయంలో పూర్తి స్పష్టత రావడం లేదు. మొదట దసరా కానుకగా సినిమా రిలీజ్ ఉంటుందని అన్నారు. ఆ తరువాత సంక్రాంతికి వెళ్తుందని అన్నారు.

అయితే రాబోయే సంక్రాంతికి బరిలో మహేష్, అల్లు అర్జున్, నాగార్జున, బాలకృష్ణ ఇలా చాలా మంది హీరోలు ఉండడంతో ఇప్పుడు దసరా సీజన్ లోనే సినిమా రిలీజ్ చేయాలని భావిస్తున్నారట. అయితే దసరా కంటే ముందుగా గాంధీ జయంతి నాడు అక్టోబర్ 2న విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నారు.

ఆరోజు సినిమా రిలీజ్ చేస్తే లాంగ్ వీకెండ్ తో పాటు దసరా సెలవులు కూడా కలిసి వస్తాయని భావిస్తున్నారు. గ్రాఫిక్స్ వర్క్ ఎక్కువగా ఉండడంతో అనుకున్న సమయానికి పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు పూర్తవుతాయా లేదా అనే సందేహాలు నెలకొంటున్నాయి.

ఈ సినిమాలో చిరంజీవికి జోడీగా నయనతార నటిస్తోంది. అలానే అమితాబ్ బచ్చన్, జగపతి బాబు, సుదీప్, విజయ్ సేతుపతి వంటి తారలు ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు.