గతరెండు నెలలుగా సుశాంత్ సింగ్ రాజ్ పుత్ డెత్ కేసు దేశంలో హాట్ టాపిక్ గా ఉంది. ఈ కేసుపై ప్రజల్లో ఉన్న ఆసక్తి రీత్యా నేషనల్ మీడియా దృష్టి మొత్తం ఈ టాపిక్ పైనే ఉంది. సుశాంత్ రాజ్ పుత్ విచారణకు సంబంధించిన విషయాలతో, ముద్దాయిల గురించి ప్రముఖంగా ప్రచురిస్తున్నారు. ముఖ్యంగా ఈ కేసులో ప్రధానా ముద్దాయిగా ఉన్న రియా చక్రవర్తి మరియు ఆమె కుటుంబం వెనుక మీడియా పడుతుంది. రోజుకు పదుల సంఖ్యలో రియా చక్రవర్తిపై కథనాలు వస్తున్నాయి. సోషల్ మీడియాలో ఆమెకు తీవ్ర వేధింపులు ఎదురవుతున్నాయి. 

ఇక ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియా గంటల కొలది ఆసక్తికర కథనాలు వండివారుస్తున్నారు. దీనిని బాలీవుడ్ బోల్డ్ హీరోయిన్ స్వర భాస్కర్ తప్పుబట్టారు. మీడియా మరియు ప్రజలను ఉద్దేసించి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఓ దేశ ద్రోహికి కూడా ఈ స్థాయి వేధింపులు, మీడియా విషపూరిత కథనాలు వచ్చి ఉండవు అన్నారు. ఆమె సోషల్ మీడియా వేదికగా రియా పట్ల మీడియా తీరును తీవ్రంగా విమర్శించారు. 

స్వర భాస్కర్ తన ట్వీట్ లో' 'టెర్రరిస్ట్ కసబ్ ని కూడా రియా చక్రవర్తిని వేదించినంతగా మీడియా వేధింపులకు గురిచేసి ఉండదు. ఇలాంటి విషపూరిత కథనాలతో ప్రజల్లోకి తప్పుడు సందేశాలు తీసుకెళుతున్న మీడియా, దానిని ప్రోత్సహిస్తున్న మనం సిగ్గుపడాలి' అని చెప్పారు. పరోక్షంగా మీడియా రియా చక్రవర్తి విషయంలో కావాలనే తప్పుడు కథనాలు ప్రచురిస్తుందన్నట్లు చెప్పారు.