చిరంజీవి పెద్ద కూతురు సుస్మిత...ఇప్పటికే క్యాస్టూమ్ డిజైనర్ గా చిరు, చరణ్ చిత్రాలకు వర్క్ చేశారు. నిర్మాతగా త‌న అదృష్టం ప‌రీక్షించుకునేందుకు సిద్ధ‌మైంది. ఈ మ‌ధ్య తన‌ భర్త విష్ణుతో కలిసి ‘గోల్డ్ బాక్స్ ఎంటర్ టైన్మెంట్’ స్థాపించిన సుస్మిత.. ‘షూటౌట్ ఎట్ ఆలేరు’ పేరుతో వెబ్ సిరీస్ కూడా నిర్మించారు. అది యావరేజ్ అనిపించుకుంది. ఇప్పుడు ఆమె డైరక్ట్ గా వెండితెరపైకు ప్రయాణం పెట్టుకుంది. తమిళంలో మంచి పేరుతెచ్చుకున్న సినిమా 8 తొట్ట‌క‌ల్ ను తెలుగు రీమేక్ కు ప్లాన్ చేస్తోంది.

 నాలుగేళ్ల క్రితం త‌మిళంలో విడుద‌లైన ఈ చిత్రం మంచి విజ‌యం సాధించింది. క‌న్న‌డ‌లోను రీమేక్ కాగా, అక్క‌డ భారీ హిట్ కొట్టింది. ఈ సినిమా రీమేక్ హ‌క్కుల‌ను ఇప్పటికే కొనుగోలు చేసిన సుస్మిత ఈ చిత్రాన్ని తెలుగులో రీమేక్ చేయాల‌ని అనుకుంటున్నారట‌.  ఓ పాత చైనీస్ మూవీ స్ఫూర్తితో ఈ చిత్రాన్ని రూపొందించాడు ద‌ర్శ‌కుడు. ఇందులో హీరో అయిన పోలీస్.. ఒక  క్రిమినల్ ని ప‌ట్టుకునే క్ర‌మంలో త‌న రివాల్వ‌ర్ కోల్పోతాడు. దాన్ని దొంగిలించిన వ్య‌క్తి మ‌రొక‌రికి దాన్ని అమ్ముతాడు. దీంతో క‌థ ఊహించని మ‌లుపులు తిరుగుతుంది. 

 తమిళంలో వెట్రి అనే కొత్త హీరో ఇందులో లీడ్ రోల్ చేశాడు. ఆకాశం నీ హ‌ద్దురాతో ఆక‌ట్టుకున్న అప‌ర్ణ బాల‌ముర‌ళి కెరీర్ ఆరంభంలో చేసిన సినిమాల్లో ఇదొక‌టి. శ్రీ గ‌ణేష్ అనే ద‌ర్శ‌కుడు రూపొందించిన ఈ థ్రిల్ల‌ర్ మూవీ ప్రేక్ష‌కుల‌ను బాగానే ఆక‌ట్టుకుంది. దీనిని మెగా క్యాంప్ కు చెందిన  ఓ యువ హీరోతో చేయనుందట సుస్మిత.