సుశాంత్ సింగ్‌ రాజ్‌పుత్‌ సోదరి శ్వేతా సింగ్‌ క్రితి తన ఫేస్‌ బుక్‌ పేజ్‌లో ఓ ఎమోషనల్‌ పోస్ట్‌ను షేర్ చేసింది. ఈ ఫోటోలో తమ కుటుంబం సభ్యులు సుశాంత్‌కు తుది వీడ్కోలు పలుకుతున్నట్టుగా ఉంది. పాట్నాలోని తమ ఇంట్లో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమానికి సంబంధించిన ఫోటోలను చూసిన అభిమానులు భావోద్వేగానికి లోనవుతున్నారు.

సుశాంత్ ఇంట్లో ఏర్పాటు చేసిన ప్రార్థనలకు సంబంధించిన ఆ ఫోటోతో పాటు `చివరి సారిగా మా చిన్నారి తమ్ముడికి ప్రేమగా వీడ్కోలు పలుకుతున్నాం. నువ్వు ఎక్కడ ఉన్నా ఎప్పుడు ఆనందంగా ఉండాలి. మేము ఎప్పటికీ నిన్ను ప్రేమిస్తూనే ఉంటాం` అంటూ కామెంట్‌ చేసింది.

ఆ ఫోటోలో సుశాంత్ సింగ్ రాజ్‌పుత్‌ తండ్రి కేకే సింగ్‌ కూడా ఉన్నారు. సుశాంత్ ఫోటోను ఉంచిన పోడియంను పూలతో అలకరించి ఉండగా కుటుంబ సభ్యులు ఆ ఫోటో ముందు ప్రార్థనలు చేస్తున్నారు. యువ నటుడు సుశాంత్ ఈ నెల 14న ముంబై లోని తన నివాసంలో ఆత్మహత్య చేసుకొని మరణించాడు. కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ జరుపుతున్నారు.

సుశాంత్ మరణం నుంచి ఇప్పుడిప్పుడే కోలుకుంటున్న కుటుంబ సభ్యులు సుశాంత్ కలలను నెరవేర్చేందుకు సిద్ధమవుతున్నారు. సుశాంత్‌ పేరిట ఫౌండేషన్‌ ఏర్పాటు చేసి సినిమా, క్రీడా, సైన్స్ రంగాల్లో అవకాశాలు దక్కని టాలెంటెడ్‌ యువకులకు సాయం చేయాలని నిర్ణయించారు. చిన్నతనంలో సుశాంత్‌ పెరిగిన ఇంటిని మ్యూజియంగా మారుస్తున్నట్టుగా ప్రకిటంచారు.