సుశాంత్‌ సింగ్‌ రాజ్‌పుత్‌ ఆత్మహత్య చేసుకొని 13 రోజులు అవుతున్నా.. ఇంకా ఏదో ఒక రూపంలో ఆ వార్త మీడియాలో నానుతూనే ఉంది. సుశాంత్ ఆత్మహత్యకు బాలీవుడ్ ఇండస్ట్రీలోని మాఫియానే కారణం అన్న అభిప్రాయం వ్యక్తం అవుతుండటంతో పోలీసులు సుశాంత్ తో గతంలో వర్క్‌ చేసినా, వర్క్‌ చేయాలనుకొని క్యాన్సిల్‌ చేసిన చిత్రాల నిర్మాతలను కూడా విచారిస్తున్నారు.

తాజాగా సుశాంత్ మరణానికి సంబంధించిన ఫైనల్ పోస్ట్ మార్టమ్‌ రిపోర్ట్ కూడా వచ్చింది. అందులో సుశాంత్‌ది ఆత్మహత్య అని తేల్చారు డాక్టర్లు. అయితే సుశాంత్ ఆత్మహత్య చేసుకునేలా కొంతమంది ఒత్తిడి తెచ్చారంటూ ఆయన అభిమానులు సీబీఐ ఎంక్వైరీ కోరుతున్నారు. అయితే ఇప్పటికే ఎంక్వైరీ ప్రారంభించిన ముంబై పోలీసులు వరుసగా ఒక్కొక్కరినీ విచారిస్తున్నారు. సుశాంత్ గర్ల్‌ ఫ్రెండ్‌ రియాతో పాటు మరికొందరు సన్నిహితులను విచారించారు.


తాజాగా నెట్‌ఫ్లిక్స్‌ డైరెక్టర్‌ ఆశిష్‌ సింగ్‌ను విచారించారు ముంబై పోలీసులు. ఆశిష్ గతంలో యష్ రాజ్‌ ఫిలింస్‌లో వైస్‌ ప్రెసిడెంట్‌గా పనిచేశాడు. ఈ సందర్భంగా ఆశిష్ మాట్లాడుతూ.. సుశాంత్ యష్‌ రాజ్ ఫిలింస్‌ కాంట్రాక్ట్‌ను బ్రేక్‌ చేయలేదని వివరించాడు. సుశాంత్ స్నేహపూర్వకంగానే కాంట్రాక్ట్‌ క్యాన్సిల్‌ చేసుకున్నాడని, తరువాత కూడా యష్‌ రాజ్‌ సంస్థతో స్నేహంగానే ఉన్నాడని వెల్లడించాడు. ఇదంత ఐదేళ్ల క్రితం జరిగిన విషయం అన్న ఆశిష్‌.. సుశాంత్‌, వైఆర్ఎఫ్ మధ్య ఎలాంటి విబేధాలు లేవని క్లారిటీ ఇచ్చాడు.