బాలీవుడ్ యువ నటుడు సుశాంత్ సింగ్ రాజ్ పుత్ ఆత్మహత్య చేసుకున్న సంగతి తెలిసిందే. కాగా.. ఆయన బలవన్మరణం ఎందరినో కలచివేసింది. టాలీవుడ్, బాలీవుడ్ తో సంబంధం లేకుండా అందరూ ఆయన మృతి పట్ల తీవ్ర ఆవేదనను వ్యక్తం చేశారు.

మరోవైపు సుశాంత్ మృతికి బాలీవుడ్ పెద్దలే కారణమంటూ నెటిజన్లు దుమ్మెత్తిపోతున్నారు. బాలీవుడ్ లో కొన్ని పెద్ద నిర్మాణ సంస్థలు సుశాంత్ ని బాయ్ కాట్ చేశాయని.. అక్కడ ఉన్న వారసత్వ రాజకీయాలే సుశాంత్ మరణానికి కారణమంటూ మండిపడుతున్నారు. వీటన్నింటి వల్ల సుశాంత్ మానసికంగా చాలా కుంగిపోయాడని అందరూ చెబుతున్నారు.

కాగా.. సుశాంత్ ఆత్మహత్యపై ఆయన తండ్రి తాజాగా మాట్లాడారు.  తాజాగా ముంబై పోలీసులు సుశాంత్ తండ్రి కేకే సింగ్‌తో మాట్లాడారట. సుశాంత్ డిప్రెషన్‌తో బాధపడుతున్నట్టు తనకు, తన కుటుంబానికి తెలియదని ముంబై పోలీసులతో ఆయన వ్యాఖ్యానించినట్టు సమాచారం. అసలు సుశాంత్ డిప్రెషన్‌కు ఎందుకు గురయ్యాడో తమకు అర్థం కావడం లేదని అన్నారట. 

అలాగే సుశాంత్ మరణం విషయంలో తాము ఎవరినీ అనుమానించడం లేదని చెప్పారట. దీంతో ముంబై పోలీసులు ప్రస్తుతం సుశాంత్ మేనేజర్‌ను, ఇతర స్నేహితులను, టీవీ నటుడు మహేష్ శెట్టిని విచారిస్తున్నారు.