బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మృతిపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. సుశాంత్ ఆత్మహత్య చేసుకోలేదని, అతనిని హత్య చేశారని జన్ అధికార్ పార్టీ చీఫ్ పప్పు యాదవ్ సంచలన ఆరోపణ చేశారు. సుశాంత్ మృతిపై సీబీఐ విచారణ జరిపించాలని ఆయన డిమాండ్ చేశారు. 

పాట్నాలోని సుశాంత్ ఇంటి వెలుపల ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. సుశాంత్ మృతిపై అతని మేనమామ కూడా అనుమానం వ్యక్తం చేశారు. సుశాంత్ ఆత్మహత్య చేసుకున్నాడని తాము అనుకోవడం లేదని, పోలీసులు నిజానిజాలను నిగ్గు తేల్చాలని ఆయన డిమాండ్ చేశారు.

కాగా.. సుశాంత్ బంధువులు కూడా ఇవే ఆరోపణలు చేస్తున్నారు. సుశాంత్ ఆత్మహత్య చేసుకునేంత పిరికివాడు కాదని.. దీనిపై సీబీఐ విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. ఈ మేరకు ప్రధాని మోదీ, హోం శాఖ మంత్రి అమిత్ షా లు ఈ ఘటనపై దర్యాప్తు చేయించాలని వారు కోరారు.

ఇదిలా ఉండగా.. ముంబైలోని తన నివాసంలో సుశాంత్ సింగ్ ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు.   సుశాంత్ సింగ్ ఎందుకు  ఆత్మహత్య చేసుకున్నాడనే విషయం తెలియాల్సి ఉన్నది.  సుశాంత్ సింగ్ ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడనే విషయం తెలుసుకున్న బాలీవుడ్ ఇండస్ట్రీ ఒక్కసారిగా షాక్ అయ్యింది.  

ఎంఎస్ ధోని సినిమాతో సుశాంత్ సింగ్ మంచిపేరు తెచ్చుకున్నారు.  2008లో సుశాంత్ సింగ్ స్టార్ ప్లస్ లోని ఓ సీరియల్ ద్వారా బుల్లితెరకు పరిచయం అయ్యారు.  ఆ సీరియల్ మంచి విజయం సాధించడంతో సుశాంత్ సింగ్ పేరు మారుమ్రోగిపోయింది.  

ఆ తరువాత కై పో చెయ్ సినిమాతో బాలీవుడ్ ఇండస్ట్రీలోకి అడుగుతుపెట్టారు.  ఈ సినిమా తరువాత శుద్ధ్ దేశీ రొమాన్స్, ఎంఎస్ ధోని, కేదారనాథ్, చిచ్చోరె సినిమాల్లో నటించి మెప్పించారు.  కొన్ని రోజుల క్రితమే సుశాంత్ సింగ్ రాజ్ పుత్ మాజీ మేనేజర్ దిశా సలిన్ ఆత్మహత్య చేసుకున్న సంగతి తెలిసిందే.