బాలీవుడ్‌ నటుడు సుశాంత్ సింగ్‌ రాజ్‌పుత్  మృతికి సంబంధించిన కేసు రోజుకో మలుపు తిరుగుతోంది. ఇప్పటికే ముంబై పోలీసులు విచారిస్తుండగా, సుశాంత్ తండ్రి కృష్ణ కుమార్ సింగ్ పాట్నా పోలీసులకు కంప్లయింట్ ఇచ్చాడు. దీంతో వారు కూడా ఈ కేసు విచారణ చేపట్టారు. ఈ ఇద్దరితో పాటు సీబీఐ కూడా సుశాంత్ సింగ్‌ రాజ్‌పుత్ మృతి కేసును టేకప్‌ చేసింది. అయితే ముందుగా సుశాంత్ మృతికి బాలీవుడ్ మాఫియా కారణం అన్న ప్రచారం జరిగినా తాజాగా విచారణ అంతా ఆర్ధిక పరమైన విషయాల చుట్టూనే తిరుగుతుంది.

ముఖ్యంగా సుశాంత్ తండ్రి కేకే సింగ్, సుశాంత్‌ గర్ల్‌ ఫ్రెండ్ రియా చక్రవర్తి మీద కంప్లయింట్ ఇవ్వటంతో కేసు పూర్తిగా ములపుతిరిగింది. సుశాంత్ సోమ్ము రియా, ఆమె కుటుంబ సభ్యులు సొంతానికి వాడుకున్నారని ఆయన తండ్రి ఆరోపిస్తున్నాడు. ఈ నేపథ్యంలో సుశాంత్ ఆర్ధిక లావాదేవిలపై ఆరా తీస్తున్నారు పోలీసులు. ఇప్పటికే పెద్ద మొత్తంలో సుశాంత్ డబ్బును రియా అవసరాలకు ఖర్చుచేసినట్టుగా పోలీసులు గుర్తించారు.

ఈనేపథ్యంలో సుశాంత్, రియాలకు సన్నిహితురాలైన శృతి మోడీ పేరు ప్రధానంగా వినిపిస్తోంది. శృతి, సుశాంత్‌కు ఏడాది కాలంగా మేనేజర్‌గా వ్యవహరిస్తోంది. సుశాంత్‌ ఆర్ధిక లావాదేవిలతో పాటు సినిమాలకు సంబంధించిన వ్యవహారాలను కూడా శృతి పర్యవేక్షిస్తోంది. ఇప్పటికే ముంబై పోలీసులు శృతిని విచారించారు. ఆ సమయంలో ఆమె సుశాంత్‌కు ఎలాంటి ఆర్ధిక సమస్యలు లేవని నెలకు దాదాపు 10 లక్షల రూపాయలు అతను ఖర్చు చేస్తున్నాడని తెలిపింది.

అయితే ఇప్పుడు పాట్నా పోలీసులు, సీబీఐ కూడా ప్రధానంగా శృతి మోడీ ని విచారించేందుకు రెడీ అవుతున్నారు. ప్రస్తుతం సీబీఐ నమోదు చేసిన కేసులో శృతి ఏ6గా ఉంది. సీబీఐతో పాటు ఈడీ కూడా శృతిని విచారణకు హాజరు కావాల్సిందిగా నోటీసులు జారీ చేసింది.