'ఒక మనసు' చిత్రంతో హీరోయిన్ గా పరిచయమైన మెగాడాటర్ నీహారిక సరైన సక్సెస్ ని అందుకోలేకపోయింది. ఇటీవల సుమంత్ అశ్విన్ హీరోగా 'హ్యాపీ వెడ్డింగ్' అనే సినిమాలో నటించింది. అది కూడా నీహారికని నిరాశ పరిచింది.

ప్రస్తుతం ఈ బ్యూటీ కొత్త దర్శకుడు ప్రణీత్ బ్రమండపల్లి దర్శకత్వంలో 'సూర్యకాంతం' అనే సినిమాలో నటిస్తోంది. ఈ సినిమాలో స్టంట్ మాస్టర్ విజయ్ కుమారుడు రాహుల్ విజయ్ హీరోగా నటిస్తున్నాడు. రాహుల్ కి జోడీగా నీహారిక కనిపించనుంది.

తాజాగా ఈ సినిమాకి సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్ ని విడుదల చేసింది చిత్రబృందం. ఈ పోస్టర్ లో నీహారిక రెండు విభిన్న గెటప్పుల్లో కనిపిస్తోంది. ఫస్ట్ లుక్ పోస్టర్ అయితే నెటిజన్లను ఆకర్షిస్తోంది.

ఈరోజు నీహారిక పుట్టినరోజు కానుకగా వరుణ్ తేజ్ ఈ పోస్టర్ ని విడుదల చేశాడు. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ పూర్తయింది. వచ్చే ఏడాదిలో సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. మార్క్ రాబిన్ సంగీతం అందిస్తోన్న ఈ సినిమాని నిర్వాణ సినిమాస్ వారు నిర్మిస్తున్నారు.