సినీ హీరోల్లో చాలా మందికి ఫ్యాన్ ఫాలోయింగ్ వున్నా అభిమానుల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయే వారు కొందరే ఉంటారు. ముఖ్యంగా కోలీవుడ్‌ హీరోలు ఫ్యాన్స్‌ను ఆదరించడంలో ముందుంటారు. రజనీ, కమల్, విక్రమ్, సూర్య, విజయ్, విశాల్, లారెన్స్ లాంటి నటులు ఫ్యాన్స్‌కి సన్నిహితంగా వుంటూ తమదైన ప్రత్యేకతను చాటుకుంటారు. అభిమానుల బాధలోనూ వెన్నంటి వుంటున్న సందర్భాలు చాలానే చూశాం. ఇటీవల కార్తీ తన అభిమాని చనిపోతే... స్వయంగా వెళ్ళి కన్నీళ్లు పెట్టుకోవడం చూశాం. అంతేకాక ఆ కుటుంబానికి అండగా నిలిచి తన వ్యక్తిత్వం ఏంటో చెప్పకనే చెప్పాడు.

 

తాజాగా నిన్న సూర్య 'గ్యాంగ్‌' మూవీ త‌మిళ ప్రీ రిలీజ్ వేడుక‌లో కూడా అభిమానులకు సంబంధించి ఇలాంటి సంఘ‌ట‌న ఒక‌టి జ‌రిగింది. సూర్య నటించిన ‘గ్యాంగ్’ మూవీ ప్రమోషన్స్‌లో భాగంగా గురువారం నాడు ఈ మూవీ ప్రీ రిలీజ్ వేడుకను ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకలో సూర్య వేదికపై ఉండి మాట్లాడుతుండగా కొంతమంది యువ అభిమానులు ఆయన్ను కలిసేందుకు వేదికపైకొచ్చి అమాంతం సూర్య కాళ్ళ మీద పడి అభివాదం చేశారు. ఒక్కసారిగా అలా ఫ్యాన్స్ తన కాళ్లపై పడటాన్ని చూసి ఇబ్బందిగా ఫీల్ అయిన సూర్య.. వెంటనే తిరిగి ఫ్యాన్స్ కాళ్లకు ప్రతినమస్కారం చేసి.. ఇకపై కాళ్ళమీద పడి నమస్కారం చేయెద్దని వినమ్రంగా నచ్చ చెప్పాడు.

 

తమిళ హీరోలకు అభిమానుల పట్ల ప్రేమాభిమానాలు కురిపించే అలవాటు అనాదిగానే వుంది. ఇప్పుడున్న సూపర్ స్టార్ రజినీ మొదలు కమల్, సూర్య, విజయ్స విశాల్ దాకా  తమిళ హీరోలంతా అభిమానుల పట్ల ప్రేమానురాగాలతో వుంటారు. ఇటీవల జల్లికట్టు ఉద్యమంలో అభిమానుల పిలుపు అందుకుని స్వయంగా ఉద్యమాన్ని కోలీవుడ్ స్టార్లు ముందుండి నడిపించారు. తాజాగా సూర్య అభిమానులకు తిరిగి మొక్కటం అభిమానుల పట్ల తమిళ హీరోలకుండే ప్రేమాభిమానాలు తెలియజేస్తోంది.