బిగ్ బాస్ హౌస్ నుండి బయటికి వచ్చిన మొదటి కంటెస్టెంట్ సూర్య కిరణ్ గురించి ప్రేక్షకులు ఇప్పుడిప్పుడే తెలుసుకుంటున్నారు. బాల నటుడిగా కెరీర్ ప్రారంభించిన సూర్య కిరణ్ చిరంజీవి హీరోగా వచ్చిన రాక్షసుడు, దొంగమొగుడు, కొండవీటి దొంగ సినిమాలలో నటించాడు. అలాగే నాగార్జున నటించిన సంకీర్తన మూవీలో కూడా ఆయన చైల్డ్ ఆర్టిస్ట్ గా చేయడం జరిగింది. బాలనటుడిగా వందల చిత్రాలలో చేసిన సూర్య కిరణ్ అనేక అవార్డులు గెలుపొందారు. 

2003లో సుమంత్ హీరోగా వచ్చిన సత్యం దర్శకుడిగా సూర్య కిరణ్ మొదటి చిత్రం. ఆ మూవీ సూపర్ హిట్ కావడంతో సుమంత్ తోనే  ధన 51 మూవీ చేశారు. ఐతే ఆ చిత్రం ఆశించిన విజయం సాధించలేదు. మంచు మనోజ్ తో చేసిన రాజుభాయ్ మూవీతో పాటు మరో రెండు చిత్రాలు పరాజయం కావడంతో సూర్య కిరణ్ కెరీర్ ప్రమాదంలో పడింది. 

కెరీర్ లో ఒడిదుడుకులు మొదలవడంతో సూర్య కిరణ్ పర్సనల్ లైఫ్ కూడా ఇబ్బందుల పాలైంది.  సూర్య కిరణ్ ప్రేమించి పెళ్లి చేసుకున్న హీరోయిన్ కళ్యాణి ఆయనకు దూరం అయ్యింది. వీరిద్దరి మధ్య మనస్పర్థలు రావడానికి విడిపోవడానికి ఆర్థిక ఇబ్బందులే అని సూర్య కిరణ్ చెప్పుకొచ్చారు. 

సినిమా వలన సూర్య కిరణ్ కోట్లు నష్టపోయారట. 10కోట్ల రూపాయలు వరకు తన సొంత డబ్బులు సినిమాల వలన నష్టపోయారట. దీనితో అప్పులు చేయాల్సిన పరిస్థితి ఏర్పడిందట. రోజూ అప్పుల వాళ్ళు ఇంటికి వచ్చి ఇబ్బంది పెడుతుంటే కళ్యాణి  చాలా బాధపడేవారట. ఆమె నా నుండి విడాకులు కోరుకోవడానికి కూడా ఇదే కారణం అని సూర్య కిరణ్ చెప్పుకొచ్చారు.