తెలుగు తమిళ భాషల్లో మంచి క్రేజ్ సొంతం చేసుకున్న హీరో సూర్య. తెలుగులో కూడా సూర్యకు మంచి మార్కెట్ ఉంది. గజినీ, సింగం సిరీస్ చిత్రాలతో సూర్య తెలుగు ఆడియన్స్ కు బాగా చేరువయ్యాడు. విలక్షణమైన నటన సూర్య ప్రధాన బలం. ప్రయోగాత్మక చిత్రాలలో నటించేందుకు సూర్య ఆసక్తి చూపుతుంటాడు. 

సూర్య ప్రస్తుతం నటిస్తున్న చిత్రం కాప్పాన్. తెలుగులో బందోబస్త్ గా రిలీజ్ అవుతోంది. తాజాగా ఈ చిత్ర తమిళ ట్రైలర్ ని రిలీజ్ చేశారు. ఈ చిత్రంలో సూర్య ప్రధానికి రక్షణ కల్పించే సెక్యూరిటీ ఆఫీసర్ గా, సీక్రెట్ ఏజెంట్ గా నటిస్తున్నాడు. తాజాగా విడుదలైన ట్రైలర్ లో విజువల్స్, యాక్షన్ సన్నివేశాలు అద్భుతంగా ఉన్నాయి. 

సూర్య వివిధ గెటప్పులలో మారుతూ యాక్షన్ సీన్స్ లో అదరగొడుతున్నాడు. ఇక హీరోయిన్ గా యంగ్ బ్యూటీ సాయేషా సైగల్ నటిస్తోంది ఈ చిత్రానికి కెవి ఆనంద్ దర్శకుడు. సూర్య కెవి ఆనంద్ లది సూపర్ హిట్ కాంబినేషన్. గతంలో వీరిద్దరి కలయికలో వీడోక్కడే, బ్రదర్స్ చిత్రాలు వచ్చాయి. 

లైకా ప్రొడక్షన్స్ సంస్థ నిర్మిస్తున్న చిత్రంపై భారీ అంచనాలు ఉన్నాయి. సెప్టెంబర్ 20న బందోబస్త్ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. మోహన్ లాల్, నటుడు ఆర్య ఈ చిత్రంలో కీలక పాత్రల్లో నటిస్తున్నారు.