తమిళ స్టార్ హీరో సూర్య ప్రస్తుతం 'కాప్పాన్' అనే సినిమాలో నటిస్తున్నాడు. ఈ సినిమాను తెలుగులో 'బందోబస్త్' అనే పేరుతో విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. సెప్టెంబర్ 20న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.

అయితే ఈ సినిమా కథ తనదంటూ చెన్నై క్రోమ్ పేటకు చెందిన జాన్ చార్లెస్ అనే వ్యక్తి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. సినిమా విడుదల చేయకుండా ఆపాలని తన పిటిషన్ లో పేర్కొన్నారు. పదేళ్ల నుండి సినిమా ఇండస్ట్రీలో పని చేస్తున్నట్లు చెప్పిన జాన్.. తాను 'సరవెడి' అనే పేరుతో రాసుకున్న కథను దర్శకుడు కెఎస్ రవికుమార్, కెవి ఆనంద్ లకు చెప్పానని తెలిపారు.

కెవి ఆనంద్ కథ విని నచ్చిందని తనకు అవకాశం కల్పిస్తానని చెప్పినట్లు వెల్లడించారు. అయితే తనకు ఛాన్స్ ఇవ్వకుండా తన కథతోనే 'బందోబస్త్' సినిమా నిర్మించారని తెలిసి షాక్ అయినట్లు జాన్ చార్లెస్ తెలిపారు. కాబట్టి 'బందోబస్త్' సినిమాను విడుదల చేయకుండా నిషేధించాలని అతడి కోర్టుని కోరారు. పిటిషన్ పరిశీలించిన న్యాయమూర్తులు కేసుని సెప్టెంబర్ 4కి వాయిదా వేశారు.