మిచౌంగ్ తుఫాను విధ్వంసం కారణంగా చెన్నై నగరం నీట మునిగింది. ఈ నేపథ్యంలో ఆపదలో ఉన్న వారిని ఆదుకునేందుకు తమవంతు సహాయాన్ని ప్రకటించారు సూర్య, కార్తి.
మిచౌంగ్ తుఫాను విధ్వంసం కారణంగా రెండు రాష్ట్రాలు అతలాకుతలం అవుతున్నాయి. తమిళనాడు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలు, ముఖ్యంగా సముద్ర తీర ప్రాంతాలు వణికిపోతున్నాయి. వరదల్లో సమీప ప్రాంతాలన్నీ మునిగిపోయాయి. చెన్నై సీటీ నీటిలో మునిగిపోయింది. అమీర్ ఖాన్, విష్ణు విశాల్ వంటి సెలబ్రిటీలు సైతం ఈ వరదల్లో ఇరుక్కున్నారంటే వరదల తాకిడి ఏం రేంజ్‌లో ఉందో అర్థం చేసుకోవచ్చు. ఈ సందర్భంగా సముద్ర తీర ప్రాంత ప్రజలను, నీట మునిగిన ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు తమిళనాడు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది.
ఈ నేపథ్యంలో కష్టకాలంలో ఉన్న ప్రజలను ఆదుకునే దాంట్లో భాగంగా సినిమా సెలబ్రిటీలు స్పందిస్తున్నారు. తమ అభిమానులు ఈ సహాయక కార్యక్రమాల్లో పాల్గొనాలని చెబుతున్నారు. అంతేకాదు హీరోలు సూర్య, కార్తీలు తమవంతుగా ఆర్థిక సాయం కూడా ప్రకటించారు. మొట్ట మొదటగా పది లక్షలను వారి సీఎం రిలీఫ్ ఫండ్‌కి అందజేశారు. అంతేకాదు ఆపదలో ఉన్న ప్రజలను ఆదుకోవాలని వారు తమ అభిమానులకు పిలుపినిచ్చారు. గతంలోనూ చెన్నై వరదల సమయంలో సూర్య బ్రదర్స్ స్పందించిన తమ వంతు సహాయాలను అందించిన విషయం తెలిసిందే.
ఇదిలా ఉంటే హీరో విశాల్.. చెన్నై వరదల పరిస్థితిని చూసి ఆయన మేయర్‌ని ప్రశ్నించిన విషయం తెలిసిందే. మీరైతే హ్యాపీగా సురక్షితంగా ఉన్నారుగా అంటూ సెటైర్లు పేల్చుతూ వాస్తవ పరిస్థితిని వివరించే ప్రయత్నం చేశారు.
