సీనియర్ హీరో వెంకటేష్, నాగచైతన్య కలిసి 'వెంకీ మామ' అనే సినిమాలో నటించనున్న సంగతి తెలిసిందే. నిజానికి ఇప్పటికే ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లాలి కానీ పలుసారి వాయిదా పడుతూనే ఉంది. దానికి కారణం నిర్మాత సురేష్ బాబు అని తెలుస్తోంది.

సురేష్ బాబు తన సినిమాలకు సంబంధించి చాలా ఎక్కువగా ఇన్వాల్వ్ అవుతుంటాడు. నిర్మాణంలో మాత్రమే కాకుండా క్రియేటివ్ సైడ్ కూడా ఆయన హ్యాండ్ ప్రతీ సినిమాలో ఉంటుంది. 'వెంకీ మామ' సినిమా విషయంలో కూడా పరిస్థితి ఇలానే ఉందట. అయితే ఈసారి వ్యవహారం మరీ శ్రుతిమించినట్లు సమాచారం. సురేష్ బాబుని సంతృప్తి పరిచేసరికి దర్శకుడు బాబీ ప్రాణం పోతుందని అంటున్నారు.

ఇప్పటికి దాదాపు ఏడెనిమిది సార్లు సీన్ ఆర్డర్లు, ట్రీట్మెంట్ లు మార్చుకుంటూ వెళ్లారట. అయినప్పటికీ సురేష్ బాబుకి సంతృప్తి కలగలేదట. ఇప్పటివరకు ఆయన స్క్రిప్ట్ ని ఫైనల్ చేయలేదని తెలుస్తోంది. దీంతో దర్శకుడు బాబీ అసంతృప్తికి గురవుతున్నాడట. ఇప్పటికే దర్శకుడు కళ్యాణ్ కృష్ణని తప్పించి లైన్ లోకి బాబీని తీసుకొచ్చారు.

జనవరిలో గనుక షూటింగ్ మొదలుకాకపోతే బాబీ కూడా ఈ సినిమా నుండి తప్పుకునే ఛాన్స్ లు ఉన్నాయని అంటున్నారు. నాగచైతన్య కూడా మొదట ఈ సినిమాను  మొదలుపెట్టాలని అనుకున్నాడు. కానీ స్క్రిప్ట్ ఎంతసేపటికి ఫైనల్ కాకపోవడంతో 'మజిలి'ని ముందుగా సెట్స్ పైకి తీసుకెళ్లారు.