ఒకప్పుడు సురేష్ ప్రొడక్షన్స్ నిర్మాణంలో వరుసపెట్టి చిత్రాలు విడుదలయ్యేవి. ఇటీవల ఆ జోరు కాస్త తగ్గింది. మళ్ళీ సురేష్ ప్రొడక్షన్స్ నుంచి గతంలో మాదిరిగా భారీ చిత్రాలు తెరకెక్కబోతున్నాయి. గురువారం మూవీ మొఘల్ డి రామానాయుడి జయంతి. ఈ సందర్భంగా సురేష్ బాబు బుధవారం రోజు రామానాయుడు స్టూడియోలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడారు. అనేక ఆసక్తికర విషయాలని సురేష్ బాబు ప్రకటించారు. 

అజయ్ దేవగన్, టబు, రకుల్ ప్రీత్ సింగ్ కలసి నటించిన దే దే ప్యార్ దే చిత్రం ఇటీవల విడుదలై ఘనవిజయాన్ని సొంతం చేసుకుంది. వెంకటేష్ బాడీ లాంగ్వేజ్ కు సరిపోయే చిత్రం అని చాలామంది సినీ విశ్లేషకులు తెలిపారు. దీనితో వెంకీ హీరోగా ఈ చిత్రాన్ని తెలుగులో రీమేక్ చేయబుతున్నట్లు ఊహాగానాలు వినిపించాయి. తాజాగా ఆ ఊహాగానాలే నిజమయ్యాయి. సురేష్ బాబు అధికారికంగా ఈ చిత్రాన్ని ప్రకటించారు. 

దే దే ప్యార్ దే చిత్రాన్ని తెలుగులో రీమేక్ చేయబోతున్నాం.. వెంకటేష్ హీరోగా నటిస్తాడు అని తెలిపారు. ఇదే కాదు మా నుంచి చాలా మంచి చిత్రాలు రాబోతున్నాయి. గుణశేఖర్ దర్శకత్వంలో తెరకెక్కబోయే 'హిరణ్యకశ్యప' చిత్రానికి గత రెండేళ్లుగా ప్రీ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఈ చిత్రం ఇండియాలో భారీ ప్రాజెక్ట్ అయ్యే అవకాశాలు ఉన్నాయి అని సురేష్ బాబు అన్నారు. 

పరాజయాలు ఎదురైనా అవకాశాలు అందిపుచ్చుకోవచ్చని మా తండ్రిని చూసే నేర్చుకున్నాం. నేను, తమ్ముడు వెంకటేష్, రానా సినిమాల్లోనే కొనసాగుతుండడం సంతోషాన్నిస్తోందని సురేష్ బాబు అన్నారు.