విలక్షణ నటుడు విజయ్ సేతుపతి క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. సోలో హీరోగా హిట్స్ కొడుతూనే.. వైవిధ్యమైన పాత్రలతో దూసుకుపోతున్నాడు.
విలక్షణ నటుడు విజయ్ సేతుపతి క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. సోలో హీరోగా హిట్స్ కొడుతూనే.. వైవిధ్యమైన పాత్రలతో దూసుకుపోతున్నాడు. క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా, హీరోగా, విలన్ గా విజయ్ సేతుపతి తక్కువ సమయంలోనే అనేక ప్రయోగాలు చేశారు. ప్రేక్షకుల నుంచి ప్రశంసలు దక్కించుకున్నాడు.
కమల్ హాసన్ విక్రమ్ చిత్రం బాక్సాఫీస్ వద్ద అంతటి ఘనవిజయం సాధించింది అంటే.. అందులో విజయ్ సేతుపతి పోషించిన సంతానం పాత్ర ప్రాధాన్యత ఎంతైనా ఉంది. విలన్ గా అద్భుతమైన నటనతో విజయ్ సేతుపతి మెప్పించాడు. అయితే విజయ్ సేతుపతిని రెండేళ్ల నుంచి ఓ వివాదం వెంటాడుతూనే ఉంది.
రెండేళ్ల క్రితం విజయ్ సేతుపతి బెంగుళూరు విమానాశ్రయంలో మహా గాంధీ అనే వ్యక్తితో గొడవ పడ్డాడు. మహా గాంధీ.. తనపై విజయ్ సేతుపతి అతని మనుషులు అటాక్ చేశారు అంటూ కోర్టులో కేసు నమోదు చేశారు. ఒక విషయంలో విజయ్ సేతుపతి, మహా గాంధీ మధ్య విభేదాలు వచ్చాయి. దీనితో గొడవ పెరిగి ఘర్షణ జరిగింది. విజయ్ సేతుపతి మనుషులు అతడిని కొట్టినట్లు అప్పట్లో సోషల్ మీడియాలో దృశ్యాలు వైరల్ అయ్యాయి.
అయితే ఈ కేసుపై ప్రస్తుతం సుప్రీం కోర్టులో విచారణ జరుగుతోంది. తాజాగా సుప్రీం కోర్టు విజయ్ సేతుపతికి చురకలు అంటించింది. సెలెబ్రిటీలు ప్రజల మధ్యలో ఉన్నప్పుడు ఎలా పడితే అలా ప్రవర్తించకూడదు. విజయ్ సేతుపతి స్టార్ హీరో. కాబట్టి ప్రజల్లో ఉన్నప్పుడు మన ప్రవర్తన అదుపులో ఉండాలనే విషయం ఆయన గుర్తుంచుకోవాలి.
మీకు చాలా మంది అభిమానులు ఉన్నారనే విషయాన్ని గుర్తుంచుకోండి. ప్రజలని తిడుతూ సెలెబ్రిటీలు వారి మధ్యలోనే తిరగడం సాధ్యం కాదు అని సుప్రీం కోర్టు పేర్కొంది. అయితే ఈ కేసు విషయంలో సుప్రీం విజయ్, మహా గాంధీలకు ఒక సూచన చేసింది. ఇద్దరికీ అంగీకారం అయితే చర్చల ద్వారా ఈ సమస్యని సెటిల్ చేసుకోవాలని సూచించింది. అందుకు అవసరరమైన ఏర్పాట్లు చేస్తాం అని పేర్కొంది. తమ సమాధానం చెప్పేందుకు ఇద్దరూ తదుపరి విచారణకు హాజరు కావాలని కోర్టు ఆదేశించింది.
