సుశాంత్‌ సింగ్‌ రాజ్‌పుత్‌ ఆత్మహత్య కేసు బాలీవుడ్‌లో పెను దుమారాన్ని రేపుతున్న విషయం తెలిసిందే. ఈ కేసులో రోజుకో కొత్త విషయం బయటపడుతూ, అనేక మలుపులు తిప్పుతోంది. ఈ నేపథ్యంలో తాజాగా ఈ కేసుని విచారించేందుకు సీబీఐకి సుప్రీంకోర్ట్ అప్పగించింది. ఈ కేసుని సీబీఐకి అప్పగించాలని ముంబయి పోలీసులను సూచించింది. దీంతోపాటు సీబీఐకి సహకరించాలని మహారాష్ట్ర ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసింది. 

సుశాంత్‌ కేసు విషయంలో ముంబయి పోలీసులు నిబద్దతతో పనిచేయడం లేదని, అసలైన సాక్ష్యాలను పక్కదారి పట్టిస్తున్నారని సుశాంత్‌ తండ్రి కేకే సింగ్‌ ఆరోపిస్తూ ఈ కేసుని సీబీఐకి అప్పగించాలని బీహార్‌ ప్రభుత్వాన్ని కోరిన విషయం తెలిసిందే. బీహార్‌ ప్రభుత్వ సిఫార్సు మేరకు కేంద్రం ఈ కేసుని సీబీఐకి అప్పగించింది. అయితే ఇందులో ప్రధాన నింధితురాలిగా భావిస్తున్న సుశాంత్‌ ప్రియురాలు రియా చక్రవర్తి బీహార్‌ పోలీసులు విచారిస్తున్న కేసుని ముంబయి పోలీసులకు అప్పగించాలని కోర్ట్ లో పిటిషన్‌ దాఖలు చేసింది. దీనిపై విచారించిన కోర్ట్ తాజాగా కేసుని సీబీఐకి అప్పగిస్తూ తీర్పుని వెల్లడించింది. 

సుశాంత్‌ జూన్‌ 14న ముంబయిలోని బాంద్రాలోగల తన ఫ్లాట్‌లో ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే. ముంబయి పోలీసులు దీన్ని ఆత్మహత్యగా ప్రాథమికంగా నిర్ధారించారు. కానీ ఆ తర్వాత అనేక కోణాలు బయటపడుతున్నాయి. సుశాంత్‌ని హత్య చేశారనే ఆరోపణలు వస్తున్నాయి. కుక్క బెల్ట్ తో గొంతు నులిమి హత్య చేశారనే ఆరోపణలు వస్తున్న విషయం తెలిసిందే. దీంతో తాజాగా కేసు సీబీఐ చేతుల్లోకి వెళ్ళడంతో ఈ కేసులో మరిన్ని కోణాలు బయటకు వస్తాయని చెప్పొచ్చు.