Asianet News TeluguAsianet News Telugu

పద్మావతి వివాదంలో తలదూర్చిన సీఎంలకు సుప్రీం అక్షింతలు

  • పద్మావతి సినిమా నిలిపేయాలంటూ సుప్రీంలో పిటిషన్
  • రిలీజ్ కాకుండానే సినిమాలో ఏముందో ఎలా చెప్తారన్న సుప్రీం
  • అర్థంలేని పిటిషన్ వేస్తే చర్యలు తీసుకుంటామని హెచ్చరిక
  • పద్మావతి పై కొందరు సీఎంల వ్యాఖ్యలను తప్పుబట్టిన సుప్రీం
supreme court dismisses petitions against padmavathi

దీపికా పదుకునె ప్రధాన పాత్రలో సంజయ్‌లీలా భన్సాలీ ప్ర‌తిష్టాత్మ‌కంగా తెరకెక్కించిన ‘పద్మావతి’ సినిమాపై రాజ్ పుత్ లు దేశ‌వ్యాప్తంగా ఆందోళ‌న‌లు చేస్తోన్న సంగ‌తి తెలిసిందే. తాజాగా, ఆ చిత్రానికి సుప్రీం కోర్టు ఊర‌ట‌నిచ్చింది. ఆ సినిమా విడుదలపై స్టే విధించాల‌ని, దర్శకనిర్మాతలపై క్రిమినల్‌ చర్యలు తీసుకోవాలని దాఖలైన పిటిషన్‌ను సుప్రీంకోర్టు మంగళవారం కొట్టివేసింది.

 

ఆ చిత్ర‌ విడుదలపై నిర్ణయం తీసుకోవాలని సెన్సార్‌ బోర్డుకు సుప్రీంకోర్టు సూచించింది. అంతేకాకుండా, అర్థంలేని పిటిష‌న్ వేసినందుకు పిటిషనర్ పై దేశంలోని అత్యున్న‌త న్యాయ‌స్థానం ఆగ్రహం వ్యక్తంచేసింది. ఈ సంద‌ర్భంగా, ఆ సినిమాపై తీవ్ర వ్యాఖ్యలు చేసిన పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులను కూడా సుప్రీం గట్టిగానే మందలించింది. బాధ్యతాయుతమైన ప్ర‌జా ప్ర‌తినిధులై ఉండి  అటువంటి వ్యాఖ్య‌లు చేయ‌డం ఏంట‌ని ప్ర‌శ్నించింది.



అస‌లు సెన్సార్‌ బోర్డు (సీబీఎఫ్‌సీ) సర్టిఫై చేయకుండానే ఒక సినిమాపై వివాదాస్ప‌ద‌ వ్యాఖ్యలు చేయ‌డాన్ని తప్పుబట్టింది. సినిమా విడుదల కాకముందే తీర్పు ఎలా చెప్తారని నేతలను నిలదీసింది. ఆ విధంగా తీర్పు చెబితే అది సీబీఎఫ్‌సీనిర్ణయంపై ప్రభావం చూపే అవకాశముందని స్ప‌ష్టం చేసింది. ఇటువంటి విషయాల‌లో చట్టాలు, నిబంధనలకు కట్టుబడి నేతలు వ్యవహరించాలని సూచించింది. `ప‌ద్మావ‌తి`లో రాణి ప‌ద్మినీ దేవి, అల్లావుద్దీన్ ఖిల్జీ ల మధ్య ఓ ప్రేమగీతాన్ని చిత్రీకరించారని కర్ణిసేన ఆధ్వ‌ర్యంలో రాజ్‌పుత్ లు ఆరోపిస్తున్న సంగ‌తి తెలిసిందే. రాజ్ పుత్ ల ఆందోళ‌న‌ల‌తో ఇప్పటికే మధ్యప్రదేశ్‌, గుజరాత్ లు ఈ సినిమాను నిషేధించాయి. ఉత్తరప్రదేశ్‌, మధ్యప్రదేశ్‌, పంజాబ్‌, గుజరాత్‌ రాష్ట్రాల ముఖ్యమంత్రులు స్వ‌యంగా ఈ సినిమాకు వ్యతిరేకంగా వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.

Follow Us:
Download App:
  • android
  • ios