Asianet News TeluguAsianet News Telugu

రాజకీయ జీవితంలో గొప్ప విజయాన్ని సాధించాలి: చంద్రబాబుతో భేటీపై రజనీకాంత్ ట్వీట్..

తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడుతో ప్రముఖ సినీ నటుడు, సూపర్‌స్టార్ రజనీకాంత్ భేటీ అయ్యారు. సోమవారం హైదరాబాద్ జూబ్లీహిల్స్‌లోని చంద్రబాబు నాయుడు నివాసంలో వీరి భేటీ జరిగింది.

Superstar Rajinikanth tweets his meeting with Chandrababu Naidu
Author
First Published Jan 10, 2023, 11:11 AM IST

తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడుతో ప్రముఖ సినీ నటుడు, సూపర్‌స్టార్ రజనీకాంత్ భేటీ అయ్యారు. సోమవారం హైదరాబాద్ జూబ్లీహిల్స్‌లోని చంద్రబాబు నాయుడు నివాసానికి వెళ్లిన రజినీకాంత్‌.. ఆయనతో మర్యాదపూర్వకంగా సమావేశం అయ్యారు. ఇందుకు సంబంధించిన ఫొటో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. చంద్రబాబుతో భేటీకి సంబంధించిన ఫొటోలను తన ట్విట్టర్ ఖాతాలో షేర్ చేసిన రజనీకాంత్.. చాలా కాలం తర్వాత తన స్నేహితుడిని కలుసుకున్నట్టుగా తెలిపారు. చంద్రబాబుకు మంచి ఆరోగ్యం, రాజకీయ జీవితంలో గొప్ప విజయాన్ని సాధించాలని ఆకాంక్షిస్తున్నట్టుగా చెప్పారు. 

‘‘చాలా కాలం తర్వాత..నా ప్రియ మిత్రుడు చంద్రబాబు నాయుడును కలిశాను. మరపురాని సమయాన్ని గడిపాను..ఆయన మంచి ఆరోగ్యంతో పాటు రాజకీయ జీవితంలో గొప్ప విజయాన్ని సాధించాలని ఆకాంక్షిస్తున్నాను’’ అని రజినీకాంత్ ట్వీట్ చేశారు. 

మరోవైపు ఈ భేటీకి సంబంధించి చిత్రాన్ని సోషల్ మీడియాలో షేర్ చేసిన చంద్రబాబు నాయుడు.. ‘‘ఈ రోజు నా ప్రియమైన స్నేహితుడు 'తలైవర్' రజినీకాంత్‌ను కలవడం, ఆయనతో మాట్లాడటం ఆనందంగా ఉంది!’’ అని పేర్కొన్నారు. 

 


ఇక, రజనీకాంత్ ప్రస్తుతం నెల్సన్ దిలీప్‌కుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న జైలర్ చిత్రంలో నటిస్తున్నారు. మోహన్‌లాల్, శివ రాజ్‌కుమార్, రమ్యకృష్ణ, యోగి బాబు, వసంత్ రవి, వినాయకన్.. తదితరులు ఈ చిత్రంలో నటిస్తున్నారు. ఈ చిత్రంలో రజనీకాంత్.. జైలర్ ముత్తువేల్ పాండియన్ పాత్రలో నటిస్తున్నారు. ప్రస్తుతం ఈ చిత్ర షూటింగ్ హైదరాబాద్‌లో జరుగుతుంది. ఈ క్రమంలోనే చంద్రబాబు నివాసానికి వెళ్లిన రజనీకాంత్ ఆయనను మర్యాదపూర్వకంగా కలిసినట్టుగా సంబంధిత వర్గాలు తెలిపాయి.

మ‌రో స‌రికొత్త చ‌ర్చ‌.. !
చంద్ర‌బాబు నాయుడును ర‌జినీకాంత్ మ‌ర్యాదపూర్వ‌కంగానే క‌లిసిన‌ట్టు సంబంధిత వ‌ర్గాలు తెలిపాయి. అయితే ఈ భేటీపై మ‌రో స‌రికొత్త చ‌ర్చ మొద‌లైంది. రాజ‌కీయంగానే ఈ స‌మావేశం జరిగి ఉంటుందని.. అంతకు ముందరోజే చంద్రబాబుతో జనసేన అధినేత పవన్ కల్యాణ్ భేటీ అయిన విషయాన్ని ఈ సందర్భంగా కొందరు విశ్లేషకులు ప్రస్తావిస్తునున్నారు. అయితే రజనీకాంత్‌కు బీజేపీ సానుభూతిపరుడనే ముద్ర ఉండటమే కారణమని వారు అంటున్నారు. 

గ‌తంలో ర‌జినీకాంత్ రాజ‌కీయ రంగ ప్ర‌వేశం చేసి.. మ‌ళ్లీ రాజ‌కీయాల‌ను నుంచి పూర్తిగా త‌ప్పుకుంటున్న‌ట్టు ప్ర‌క‌టించారు. అప్ప‌టి నుంచి రాజ‌కీయాల‌కు దూరంగా ఉంటున్న‌ప్ప‌టికీ కాషాయ పార్టీకి ఆయ‌న సానుకూలంగా ఉంటున్నార‌ని రాజ‌కీయ వ‌ర్గాల మాట‌. ప‌వ‌న్ భేటీ త‌ర్వాత ర‌జినీకాంత్, చంద్ర‌బాబు క‌ల‌వ‌డం వెనుక‌ కాషాయ పార్టీ నేత‌లు ఉన్నారా?  అనే చ‌ర్చ‌కూడా మొద‌లైంది.  
 

Follow Us:
Download App:
  • android
  • ios