Thalaivar 170 : రజినీకాంత్ 170వ చిత్రం అఫీషియల్ అనౌన్స్ మెంట్.. సూర్య డైరెక్టర్ తో తలైవా.. డిటేయిల్స్!
సూపర్ స్టార్ రజినీకాంత్ (Rajinikanth) తన 170వ చిత్రాన్ని కూడా కన్ఫమ్ చేశారు. ప్రముఖ బ్యానర్ లో ఆయన నాల్గో చిత్రాన్ని కూడా ప్రకటించారు. ఇందుకు సంబంధించి వివరాలు ఇలా ఉన్నాయి.
దక్షిణాది నటులలో సీనియర్ నటుడు, సూపర్ స్టార్ రజినీకాంత్ కు ఎంతటి క్రేజ్ ఉంటుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉండటంతో 70 ఏండ్ల వయస్సులోనూ రజినీకాంత్ వరుస చిత్రాలతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు. ప్రస్తుతం నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వంలో ‘జైలర్’ (Jailer) చిత్రంలో నటిస్తున్నారు. చిత్ర షూటింగ్ శరవేగంగా కొనసాగుతోంది. మిల్క్ బ్యూటీ తమన్నా భాటియా హీరోయిన్ గా నటిస్తోంది. అలాగే కూతురు ఐశ్వర్య దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘లాల్ సలామ్’లోనూ గెస్ట్ రోల్ లో నటించబోతున్నట్టు తెలుస్తోంది. ఈ చిత్రాన్ని ప్రముఖ లైకా ప్రొడక్షన్ బ్యానర్ నిర్మిస్తోంది. ఇదే బ్యానర్ లో రజినీకాంత్ మరో చిత్రం చేయబోతున్నాడు.
Thalaivar 170 చిత్రం ప్రకటన తాజాగా అందింది. Lyca ప్రొడక్షన్స్ బ్యానర్ పై నిర్మించబోతున్నారు. ఇప్పటికే ఈ బ్యానర్ లో రజినీకాంత్ ‘రోబో 2.0’, ‘దర్బార్’ చిత్రాలు చేశారు. ప్రస్తుతం ‘లాల్ సలామ్’ కూడా తెరకెక్కుతోంది. ఇక తాజాగా రజినీకాంత్ నాలుగో చిత్రాన్ని కూడా ఇదే బ్యానర్ నిర్మించబోతున్నట్టు అధికారిక ప్రకటన వెలువరించింది. ఈరోజు లైకా సంస్థ చైర్మన్, స్టార్ ప్రొడ్యూసర్ సుభాకరన్ పుట్టినరోజు సందర్భంగా రజినీ ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్ చెప్పారు. ‘తలైవా170’ చిత్రాన్ని తమ బ్యానర్ లోనే నిర్మిస్తున్నామని అనౌన్స్ చేశారు. ఈ గుడ్ న్యూస్ తో ఫ్యాన్ ఫుల్ ఖుషీ అవుతున్నారు.
ప్రముఖ తమిళ దర్శకుడు టీజే జ్ఞానవేల్ (TJ Gnanavel) ఈ చిత్రాన్ని డైరెక్ట్ చేయబోతున్నారు. ఈయన చివరిగా తమిళ స్టార్ హీరో సూర్యతో ‘జై భీమ్’ చిత్రాన్ని తెరకెక్కించి ప్రశంసలు అందుకున్న విషయం తెలిసిందే. బలమైన కథలను ఎంచుకోవడం దర్శకుడి ప్రత్యేకత. ఈ క్రమంలో రజినీని 170వ చిత్రంలో ఎలా ప్రజెంట్ చేయబోతున్నారనేది ఆసక్తికరంగా మారింది. రాక్ స్టార్ అనిరుధ్ రవిచంద్రన్ సంగీతం అందిస్తున్నారు. సుభాకరన్ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. త్వరలో షూటింగ్ సైతం ప్రారంభించబోతున్నట్టు తెలిపారు. వచ్చే ఏడాది 2024లో చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. త్వరలో సినిమాకు సంబంధించిన మరిన్ని వివరాలు రానున్నాయి.