తమిళ సూపర్ స్టార్ రజినీకాంత్ ఆరోగ్య పరిస్థితిపై హైదరాబాద్ అపోలో ఆస్పత్రి వర్గాలు హెల్త్ బులెటిన్‌ను విడుదల చేశాయి. సాయంత్రం 6 గంటల నాటికి ఆయన ఆరోగ్యం నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు.

బీపీ అదుపులోనే ఉందని అపోలోనే వుందని.. ఇప్పటి వరకు చేసిన వైద్య పరీక్షల్లో ఎలాంటి ఆందోళనరమైన అంశాలు లేవని వెల్లడించారు. మరికొన్ని పరీక్షలు చేశామని.. వాటి నివేదికలు రావాల్సి ఉందని డాక్లర్లు పేర్కొన్నారు.

ఆ వైద్య పరీక్షల నివేదికలతో పాటు బీపీ పరిస్ధితిని ఈ రోజు రాత్రి పరిశీలించి రజినీకాంత్‌ను డిశ్చార్జిపై రేపు నిర్ణయం తీసుకుంటామని వైద్యులు వెల్లడించారు. కాగా , రజినీకాంత్ హైబీపీతో శుక్రవారం అపోలోలో చేరిన సంగతి తెలిసిందే.

తలైవా గత 10 రోజులుగా హైదరాబాద్‌లోనే ఉన్నారు. అన్నాత్తై షూటింగ్ నిమిత్తం సూపర్‌స్టార్ నగరానికి వచ్చారు. అయితే కొన్ని రోజుల క్రితం చిత్ర యూనిట్‌లో పలువురికి కరోనా పాజిటివ్‌గా తేలింది.

దీంతో ముందు జాగ్రత్త చర్యగా రజినీకాంత్ క్వారంటైన్‌‌‌కు వెళ్లారు. ఈ క్రమంలో డిసెంబరు 22న నిర్వహించిన కరోనా పరీక్షల్లో ఆయనకు నెగెటివ్ వచ్చింది. అయితే శుక్రవారం ఉదయం ఒక్కసారిగా బీపీ పెరగడంతో రజనీ అపోలోలో చేరారు.