నటీనటులు: మహేష్ బాబు, రకుల్ ప్రీత్ సింగ్, ఎస్ జే సూర్య, ప్రియదర్శి తదితరులు సంగీతం: హారిస్ జయరాజ్ సినిమాటోగ్రఫీ: సంతోష్ శివన్ నిర్మాత: ఠాగూర్ మధు,ఎన్వీ ప్రసాద్ దర్శకత్వం: ఎ.ఆర్.మురుగదాస్ నిడివి :125 నిమిషాలు ఆసియానెట్ రేటింగ్: 2.75/5
శ్రీమంతుడు లాంటి బ్లాక్ బస్టర్ అందుకుని మళ్లీ అంతే స్పీడుగా బ్రహ్మోత్సవం సినిమాతో.. ఒక్కసారిగా డౌన్ ఫాల్ అయిన ప్రిన్స్ మహేష్ బాబు తాజాగా మురుగదాస్ కాంబినేషన్లో భారీ బడ్జెట్తో తెరకెక్కిన 'స్పైడర్' మూవీతో ప్రేక్షకుల ముందుకొచ్చాడు. అభిమానుల భారీ అంచనాల మధ్య దసరా కానుకగా ప్రపంచ వ్యాప్తంగా మహేష్ కెరియర్లో అత్యధిక స్క్రీన్స్ పై.. 'స్పైడర్' మూవీ ప్రదర్శించబడుతోంది. మరి భారీ అంచనాలతో రిలీజైన స్పైడర్ బాక్సాఫీస్ వద్ద సక్సెస్ సాధిస్తుందా.. లేదా .. చూద్దాం.
కథ:
శివ(మహేష్ బాబు) ఇంటలిజెన్స్ ఆఫీసర్. టెక్నాలజీని వినియోగించుకుంటూ ఫోన్స్ టాప్ చేసి నిందితులను పట్టుకోవడం అతని పని. అయితే ఫోన్లు వినేటప్పుడు కష్టాల్లో వున్న వారిని కాపాడేందుకు ప్రత్యేక శ్రద్ధ వహిస్తూ పనిచేస్తుంటాడు. అలా పోన్స్ వింటున్నప్పుడు ఒకరోజు 18 ఏళ్ల అమ్మాయి ఇంట్లో ఎవరూ లేకపోవడంతో భయపడుతూ తన ఫ్రెండ్ కి చేసిన కాల్ ని శివ ఫోన్ టాపింగ్ లో వింటాడు.. ఒక లేడీ పోలీస్ కానిస్టేబుల్ ను ఆమె ఇంటికి పంపిస్తాడు శివ. కానీ మరుసటిరోజు రోజు ఉదయం ఆ ఇద్దరూ శవాలుగా మారి కనిపిస్తారు. ఎవరో ఆ ఇద్దరు మహిళలను ముక్కలు ముక్కలుగా కోసి చంపేస్తారు. ఈ సంఘటన శివను ఎంతగానో బాధిస్తుంది. ఇది ఇక్కడితో ఆగిపోతుందా..? లేక ఏదైనా పెద్ద ప్రమాదానికి ఆరంభమా..? అనే ఆలోచన శివను కుంగదీస్తుంది.
ఈ హత్యలు చేసింది ఎవరనే విషయాలు తెలుసుకునే ప్రయత్నంలో శివకు భైరవుడు(ఎస్.జె.సూర్య) అనే వ్యక్తి గురించి తెలుస్తుంది. శ్మశానంలో పుట్టిన భైరవుడికి చావు చూడడం అంటే సరదా.. అవతలి వ్యక్తుల ఏడుపులో తన సంతోషాన్ని చూసుకుంటాడు భైరవుడు. ఈ సైకో కిల్లర్‌ను పట్టుకునే క్రమంలో శివ ఎలాంటి పరిస్థితులను ఎదుర్కొన్నాడు..? భైరవుడు సైకోగా మారడానికి గల కారణాలు ఏంటి..? చివరకి భైరవుడు ఏమవుతాడు..? అనే విషయాలు తెరపై చూసి తెలుసుకోవాల్సిందే.

విశ్లేషణ:
టెక్నాలజీ పెరిగిపోయి ఇప్పుడంతా స్మార్ట్ ఫోన్ల ప్రపంచం ఎక్కువైంది. దీంతో పక్కనున్న వాడి ముఖం కూడా చూసేందుకు తీరికలేని బిజీ లైఫ్ గడిపేస్తున్నారు అందరూ. మనిషి జీవితం పక్కనున్న వారిని కూడా చిరునవ్వుతో పలకరించలేనంత బిజీగా మారిందని, పక్కనున్న మనుషులను పట్టించుకోవడం మానేసి ఫేస్ బుక్ , ట్విటర్ లో లైకులు, కమెంట్స్ అంటూ డివైస్ లతో ప్రేమలో పడిపోయారు. అంతా వస్తువులను ప్రేమిస్తూ.. మనుషులను పట్టించుకోవడం మానేశారు. మానవత్వం అనే మాటను మర్చిపోతున్నారు. ఎదుటి వ్యక్తిలో ప్రేమను చూడలేకపోతున్నారు. ఇలాంటి వేగవంతమైన యుగంలో మనం కూడా వేగంగానే ఉండాలి.. కానీ సేమ్ టైమ్ మానవత్వాన్ని మర్చిపోకూడదనే విషయాన్ని దర్శకుడు మురుగదాస్ ‘స్పైడర్’ సినిమా ద్వారా చెప్పే ప్రయత్నం చేశాడు. సాధారణంగా మురుగదాస్ సినిమాలు వినోదంతో ఉంటూనే అంతర్లీనంగా ఒక సందేశం ఉంటుంది. అయితే ఈసారి ఒక సందేశాన్ని కమర్షియల్ ప్యాకేజ్ మాదిరి ప్రేక్షకులకు అందించాడు. అయితే మహేష్ లాంటి హీరోకు మరిన్ని యాక్షన్ ఎలిమెంట్స్ యాడ్ చేయాల్సింది అనిపిస్తుంది.
ప్రజలను తన పైశాచిక ఆనందం కోసం చంపే ఓ సైకో, అతడిని అడ్డుకొని ప్రజలను కాపాడాలని చూసే ఓ ఇంటెలిజెన్స్ ఆఫీసర్. ఈ ఇద్దరి చుట్టూనే సినిమా మొత్తం తిరుగుతుంది. సినిమా మొదటి భాగం మొత్తం సీరియస్‌గా సాగుతూనే వినోదం పంచుతుంది. ముఖ్యంగా విలన్ బ్యాక్ స్టోరీని ప్రెజంట్ చేసిన తీరు అద్భుతం. విలన్ ఎంట్రీ సన్నివేశాలు ఆడియన్స్‌ను ఆకట్టుకుంటాయి. ఇంటర్వల్ బ్యాంగ్.. సెకండ్ హాఫ్‌లో ఏం జరగబోతుందనే క్యూరియాసిటీని పెంచేస్తుంది. అయితే సెకండ్ హాఫ్ మాత్రం మొదటి భాగం ఉన్నంత వినోదభరితంగా అనిపించదు. అప్పటివరకూ ఏదైనా చేయగల విలన్ పాత్ర సెకండ్ హాఫ్‌లో బాగా డౌన్ అవుతుందనే ఫీలింగ్ కలుగుతుంది. దాంతో హీరో కూడా ఎక్కువ ఎలివేట్ కాలేకపోయాడు. మహేష్ బాబు రేంజ్ కు మరింత యాక్షన్, డ్రామా పెట్టుంటే బాగుండనిపిస్తుంది.

నటన పరంగా :
మహేష్ బాబు లాంటి నటుడిని హీరోగా పెట్టడం వలన ఎస్.జె.సూర్య మీదకు ఫోకస్ వెళ్లడం కాస్త తగ్గుందేమో కానీ, అక్కడ మరో హీరో గనుక ఉంటే.. ఎస్.జె.సూర్య ముందు నిలవలేకపోయేవారు. తన అసాధారణమైన నటనతో వెండితెరపై అద్భుతాలు సృష్టించాడు ఎస్.జె.సూర్య. నిజంగానే సైకో అంటే ఇలాగే ఉంటాడేమో అన్నట్లుగా ఒదిగిపోయాడు. మహేష్ బాబు తన స్టైలిష్ లుక్స్, నటనతో ప్రేక్షకులను మెప్పించాడు. హీరో, విలన్ మధ్య సన్నివేశాలు, సంభాషణలు సినిమా స్థాయిని పెంచేశాయి. క్లైమాక్స్ సన్నివేశాలు ఆకట్టుకుంటాయి. రకుల్ పాత్ర పాటల వరకు మాత్రమే పరిమితమైంది.
సాంకేతికంగా :
సెకండ్ హాఫ్‌లో విజువల్ ఎఫెక్ట్స్ మీద ఇంకాస్త శ్రద్ధ పెట్టిఉంటే బాగుండేది అనిపిస్తుంది. బండరాయిని అడ్డుకునే ప్రయత్నం, రోలర్ కోస్టర్‌లో ఫైట్ వంటి సన్నివేశాలు ప్రేక్షకులను సీట్లకు అతుక్కుపోయేలా చేస్తాయి. టెక్నికల్‌గా సినిమా స్టాండర్స్ భారీ స్థాయిలో ఉన్నాయి. నేపథ్య సంగీతం ఆకట్టుకుంటుంది. సినిమాలో పాటలు మాత్రం కథను సాగదీసిన ఫీలింగ్ కలిగిస్తాయి. సంతోష్ శివన్ సినిమాటోగ్రఫీ, శ్రీకర్ ప్రసాద్ ఎడిటింగ్ సినిమాకు రెండు స్తంభాలుగా నిలిచాయి. మొత్తానికి ‘స్పైడర్’ అంటూ ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ ‘స్పై’ ప్రేక్షకులను మెప్పిస్తాడు.

ప్లస్ పాయింట్స్:
మహేష్ బాబు, ఎస్.జె.సూర్య ల నటన, రకుల్ గ్లామర్, సిసిలియా, పుచ్చకాయ పాటలు, అక్కడక్కడా విజువల్ ఎఫెక్ట్స్
మైనస్ పాయింట్స్:
మహేష్ బాబు లాంటి హీరోకు యాక్షన్ ఎపిసోడ్స్ ఎక్కువ ఎఫెక్టివ్ గా పెట్టాల్సిన అసరం వుంటుంది. కానీ ఓ సాధారణ హీరో సినిమాలో మహేష్ తో స్టంట్స్ ఏమీ చేయించకుండానే ముగించేశారనిపిస్తుంది. ఇక మహిళలతో ఓ టీవీ సీరియల్ ద్వారా విలన్ ని పట్టుకోవడం అనే ఎపిసోడ్ వుంటుంది. కానీ ఈ ఎపిసోడ్ చిత్రీకరించిన తీరు తెలుగు ప్రేక్షకులకు పెద్దగా కనెక్ట్ కాదు. సూపర్ స్టార్ మహేష్ చేయాల్సిన స్టంట్స్ అన్నీ ఆ మహిళలతో చేయించి మురుగదాస్ సీరియస్ సీక్వెన్స్ లో కామెడీ చేసేశాడు. ఇక భారీ బడ్జెట్ తో 150 కోట్లు పెట్టి తెరకెక్కించిన సినిమాలో వుండాల్సిన ఎలిమెంట్స్ మిస్ కావటం మైనస్ అనే చెప్పాలి. అంచనాలను అందుకోలేక పోయారు.
చివరగా:
నాగరికత అభివృద్ధి చెందాలంటే భయం వుండాలి. స్పైడర్ సినిమా చూడాలంటే ధైర్యం వుండాలి.
