మట్టిలో మాణిక్యాలంటే ఇలాంటి పిల్లలే. స్లమ్ లో పుట్టి పెరిగిన 11 ఏళ్ల ముంబై పిల్లాడు సంచలనం చేశాడు. ఉత్తమ చైల్డ్ ఆర్టిస్ట్ గా ప్రపంచ స్థాయి అవార్డు దక్కించుకున్నాడు. సఫ్దార్ రెహ్మాన్ దర్శకత్వంలో ఈ ఏడాది మార్చ్ 21న 'చిప్పా' అనే చిత్రం విడుదలయింది. ఈ చిత్రంలో సన్నీ పవార్ అనే చైల్డ్ ఆర్టిస్ట్ ప్రధాన పాత్రలో నటించాడు. ఈ చిత్రానికి విమర్శకుల నుంచి ప్రశంసలు దక్కాయి. 

సన్నీ పవార్ నటనకు అందరూ ఫిదా అయ్యారు. ఈ చిత్రంలో సన్నీ పవార్ వీధుల్లో జీవించే కుర్రాడిగా నటించాడు. ఈ బుడతడి ప్రతిభకు తగ్గ ప్రతిఫలం దక్కింది. న్యూయార్క్ ఇండియన్ ఫిలిం ఫెస్టివల్ 2019లో సన్నీ పవార్ కు ఉత్తమ చైల్డ్ ఆర్టిస్ట్ గా అవార్డు దక్కింది. సన్నీ పవార్ నివాసం ముంబైలోని కాలిన అనే ఓ స్లమ్ ఏరియాలో ఉంది. 2016లో సన్నీ పవార్ ప్రముఖ ఆస్ట్రేలియా దర్శకుడు గార్త్ డేవిస్ తెరక్కించిన లయన్ చిత్రంలో కూడా కీలక పాత్రలో నటించాడు. 

న్యూయార్క్ ఫిలిం ఫెస్టివల్ లో అవార్డు అందుకోవడంపై సన్నీ పవార్ సంతోషం వ్యక్తం చేశాడు. తాను ఏ ఘనత సాధించానంటే అందుకు నా తల్లిదండ్రులే కారణం. భవిషత్తులో కూడా వారు గర్వపడేలా చేస్తా. నేను రజనీకాంత్ అభిమానిని. ఆయనలా పెద్ద నటుడు కావాలని ఉంది. బాలీవుడ్ తో పాటు హాలీవుడ్ లో కూడా నటిస్తానని సన్నీ పవార్ తెలిపాడు. చిప్పా చిత్రాన్ని ఇండియన్ ఫిలిం ఫెస్టివల్ లాస్ ఏంజిల్స్ లాంటి అంతర్జాతీయ వేదికలపై కూడా ప్రదర్శించారు.