బాలీవుడ్‌ నటి సన్నీ లియోన్ మరో ఇద్దరు పిల్లలకు తల్లయ్యారు. 2017 జూన్‌లో నిషా అనే చిన్నారిని దత్తత తీసుకున్న సన్నీ, డేనియల్‌ వెబర్‌ దంపతులు ఇప్పుడు సరోగసీ(అద్దె గర్భం) పద్ధతి ద్వారా కవల మగ పిల్లలకు జన్మనిచ్చారు. ఈ విషయాన్ని సన్నీ ట్విటర్‌ ద్వారా వెల్లడించారు. ‘దేవుడి ప్లాన్‌ ఇది! 2017 జూన్‌ 21న అతి తక్కువ సమయంలోనే నేను, డేనియల్‌ ముగ్గురు పిల్లలకు తల్లిదండ్రులమవుదామని అనుకున్నాం. ఇప్పుడు మా జీవితంలోకి కొత్తగా ఆషేర్‌ సింగ్‌ వెబర్‌, నోవా సింగ్‌ వెబర్‌ వచ్చారు. కొన్ని వారాల క్రితమే వీరిద్దరూ పుట్టారు. భగవంతుడు మా కోసం ఏదన్నా ప్రత్యేకంగా చేయాలనుకున్నాడు. అందుకే మాకు ఈ రకంగా ముగ్గరు పిల్లలను ఇచ్చాడు.’ అని ట్వీట్‌లో పేర్కొన్నారు సన్నీ. గతేడాది మహారాష్ట్రలోని లాథూరుకు చెందిన ఓ అనాథాశ్రమం నుంచి సన్నీ దంపతులు 21 నెలల చిన్నారిని దత్తత తీసుకున్నారు. ఆ చిన్నారికి నిషా కౌర్‌ వెబర్‌ అని పేరు పెట్టారు. సన్నీ బిడ్డను దత్తత తీసుకోవడంపై కొందరు సానుకూలంగా స్పందిస్తే మరికొందరు నెటిజన్లు అనాథాశ్రమంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఓ పోర్న్‌స్టార్‌కు బిడ్డను ఎందుకు దత్తత ఇచ్చారని ప్రశ్నించారు. ఆ తర్వాత పలువురు సెలబ్రిటీలు సన్నీకి మద్దతుగా నిలిచి వారి నోళ్లు మూయించారు. ఇప్పుడు సరోగసీ ద్వారా సన్నీ దంపతులు ఇద్దరు పండంటి మగపిల్లలకు తల్లిదండ్రులయ్యారు.