ప్రముఖ గాయని సునీత సోషల్ మీడియా వేదికగా శారదా పీఠాధిపతి స్వరూపానంద సరస్వతిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. తనపై నిత్యం ఎన్నో రూమర్స్ వస్తుంటాయి. వాటన్నింటిపై తాను స్పందించనని సునీత తెలిపింది. కానీ కొన్ని వార్తపై తప్పనిసరిగా మాట్లాడాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. అందుకే స్వరూపానంద విషయంలో క్లారిటీ ఇస్తున్నా అని సునీత తెలిపింది. 

ఇటీవల స్వరూపానంద సరస్వతి ఓ మీడియా సంస్థకు ఇంటర్వ్యూ ఇచ్చారు. అందులో స్వరూపానంద సినిమా ప్రముఖుల గురించి చెప్పిన వీడియో వైరల్ అయింది. ఆ ఇంటర్వ్యూలో మీ వద్దకు సినీ ప్రముఖులు కూడా వస్తుంటారు కదా అని ప్రశ్నించారు. చిరంజీవి, రజనీకాంత్ కూడా వస్తుంటారు.. అదే విధంగా గాయని సునీత కూడా తన వద్దకు వస్తుంటారని స్వరూపానంద తెలిపారు. 

స్వరూపానంద వ్యాఖ్యలపై సునీత స్పందించింది. తానెప్పుడూ స్వరూపానందని కలవలేదని తెలిపింది. స్వరూపానంద లాంటి వ్యక్తి తనవద్దకు వచ్చిన వ్యక్తుల జాబితాలో నా పేరు ఎలా ప్రస్తావిస్తారు.. అది కూడా ఓ జాతీయ ఛానల్ లో అంటూ సునీత ఆగ్రహం వ్యక్తం చేసింది. ఆయన వ్యాఖ్యలు ఆశ్చర్యాన్ని కలిగిస్తున్నాయి అంటూ పోస్ట్ పెట్టింది.