సునీల్.. హాస్య నటుడుగా ఆయనకు ఉన్న క్రేజ్ అంతా ఇంతా కాదు. అయితే  హీరోగా వెళ్లి ఇమేజ్ పాడు చేసుకున్నాడు. సునీల్ అంటే ఓ బ్రాండ్ అనే స్దాయి నుంచి ఆయన సినిమాలు రాడ్ అనే సిట్యువేషన్ కు వచ్చారు. ఒకప్పుడు ఆయ‌న తెర‌పై క‌నిపిస్తే చాలు న‌వ్వులే న‌వ్వులు.కానీ హీరో అయ్యాక ఆయన ఫెయిల్యూర్స్ చూసి సినిమా వాళ్లు తెర వెనక నవ్వులే నవ్వులు.  దాంతో ఆ  ప‌రిస్థితి మ‌రీ దారుణంగా తయారవకముందే మేలుకున్నాడు.విలన్ గానూ చేస్తూ క్యారక్టర్ ఆర్టిస్ట్ గా బిజీ అవుతూ తన ఉనికిని కాపాడుకుంటూ వస్తున్నారు. ఇక హీరోగా చేస్తున్న సమయంలో  వెయిట్ తగ్గితే మరిన్ని అవకాశాలొస్తాయని.. జిమ్‌కి వెళ్లి వర్కవుట్లు చేసి స్లిమ్ అయ్యారు సునీల్. అయితే లాక్డౌన్‌లో షూటింగ్‌లు లేవు,  జిమ్ లేదు.. తినడమే పనిగా ఉండేసరికి మళ్లీ లావై పోయారు. దీంతో ఎలాగైనా తగ్గాలని భావించిన సునీల్ ప్రకృతి ఆశ్రమంలో జాయినయ్యారు. ఈ విషయం ఆయనే మీడియాకు తెలియచేసారు.

ప్రకృతి ఆశ్రమంలో చేరిన ఆయన అనూహ్యంగా అక్కడ 9  రోజుల్లో 7.5 కేజీలు తగ్గారు. ఆశ్రమంలో తానేం చేసిందీ వివరిస్తూ.. అందరూ నిండూ నూరేళ్లు ఆరోగ్యంతో ఉండాలని కోరుకుంటున్నా.. 1996 నుంచి ప్రకృతి వైద్యం  అనుసరిస్తున్నా. అయితే మధ్యలో వీలవ్వక మానేశాను. దాంతో మళ్లీ లావయిపోయాను.. ఆ విషయం మీక్కూడా తెలుసు. ఇక కరోనా టైంలో మూడు నెలలు బాగా  తినేయడంతో మళ్లీ లావయిపోయాను. లావు తగ్గడానికి వ్యాయామం చేసినా ఫలితం కనిపించలేదు. దీంతో ప్రకృతి ఆశ్రమంలో చేరాను. ఇక్కడ అన్నం తినకుండా ఎన్నిరోజులైనా ఉండొచ్చని నిరూపించారు. ముందు వెళ్లడానికి భయపడ్డా కానీ ధైర్యం చేసి ఇక్కడకు వచ్చాను. రెండు రోజులకు మించి నేను ఎప్పుడూ ఉపవాసం ఉండను. అలాంటిది ఏకంగా తొమ్మిది రోజులు ఉపవాసం ఉన్నాను. ఏమీ తినకుండా 9 రోజులు ఉపవాసం ఉండి కూడా మనిషి బతగ్గలడు అని అప్పుడు నాకనిపించింది అని చెప్పుకొచ్చారు.

ఇక ఇక్కడ  తక్కువ కేలరీలు ఉన్న ఆహారం ఎంత కావాలంటే అంత పెడతారు. దాంతో మనం బరువు పెరుగుతామనే సమస్య ఉండదు. బాడీలోకి ఫ్యాట్ చేరదు.. పైగా దాని వల్లే ఎనర్జీ  వస్తుంది. గంటకు ఒకసారి మంచినీళ్లు.. రెండు గంటలకు ఒకసారి మూడు స్పూన్ల తేనె ఒక నిమ్మ చెక్క. వీటితోనే 9 రోజులు ఏమీ తినకుండా ఉన్నాను. అసలు నీరసమే  రాదు. చేపలు, మాంసం వంటివి ఏమీ తినకపోయినా ఫుల్ ఎనర్జీతో ఉండేవాడిని. జిమ్, రన్నింగ్, సైక్లింగ్ వంటివి చేసేవాడిని. ఒకవేళ బాడీకి ఎనర్జీ కావాలనిపిస్తే ముందే చెబుతుంది. అప్పుడు తేనె తీసుకుంటే సరిపోతుంది. అన్నీ తిని లావైన పరిస్థితీ నాకు తెలుసు.. ఏమీ తినకుండా ఉన్న పరిస్థితిని ఇప్పుడు చూశా. ఏ పని చేసినా సహజంగా చేస్తేనే బాగుంటుంది అని 'మంతెన' సత్యనారాయణ రాజు ఆశ్రమంలోని తన అనుభవాలను వివరించారు హీరో సునీల్.