ఉంగరాల రాంబాబుగా వస్తున్న సునీల్ హీరో అవకాశాలను వదలనంటున్న సునీల్ కమెడియన్ పాత్రలకు కూడా సిద్ధమంటున్న సునీల్
కమెడియన్ గా తెలుగు సినీ పరిశ్రమకు పరిచయమై హీరోగా ఎదిగిన నటుడు సునీల్. కాకపోతే.. కమెడియన్ గా రాణించిన స్థాయిలో.. ఆయన హీరోగా రాణించలేకపోయారు. మర్యాదరామన్న తప్ప.. పెద్దగా చెప్పుకోదగ్గ హిట్లు ఏమీ లేవు. దీంతో తన పంథా మార్చుకునే ప్రయత్నం చేస్తున్నాడు సునీల్. ప్రస్తుతం ఆయన నటించిన ‘ ఉంగరాల రాంబాబు’ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఇక నుంచి కమెడియన్ పాత్రలు కూడా చేస్తానన్నారు. హీరోగా తనకు వస్తున్న అవకాశాలను వదలుకోకుండా వాటిని పూర్తి చేస్తానని.. అదేవిధంగా ఇతర హీరోల సినిమాల్లో కమెడియన్ పాత్రల్లోనూ నటిస్తానని చెప్పుకొచ్చారు. గత కొంత కాలం క్రితం.. ఏ సినిమాలో చూసిన కమెడియన్ గా సునీల్ కనిపించేవారు. తర్వాత హీరోగా అవకాశాలు రావడంతో.. ఆ దిశగా నిలదొక్కుకోవాలనే ప్రయత్నంలో.. ఈ అవకాశాలను పక్కకు నెట్టేశాడు.
అయితే.. ఇప్పుడు కమెడియన్ గా కూడా చేస్తానని ఆయన ప్రకటించినప్పటికీ.. ఇప్పుడు సునీల్ కి కమెడియన్ గా అవకాశాలు వస్తాయా అనే అనుమానం మొదలైంది. ప్రస్తుతం తెలుగు సినీ పరిశ్రమలో కమెడియన్లు చాలా మందే ఉన్నారు. తాజాగా జబర్దస్త్ ప్రోగ్రాంలో నటీనటులు కూడా కమెడియన్లుగా మంచి అవకాశాలు దక్కించుకుంటున్నారు. అంతేకాకుండా సునీల్ ప్రస్తుతం బాగా తగ్గి.. కండలు పెచ్చి ఉన్నారు. ఒకప్పుడు బొద్దుగా ఉండటంతో కమెడియన్ గా బాగా సెట్ అయ్యారు. ఇప్పుడు ఆయన ఫేస్ హాస్యనటనకు సరిపోదేమో అనే వాదన కూడా వినపడుతోంది. మరి సునీల్ కోరుకున్నట్లు అవకాశాలు దక్కించుకుంటాడో లేదో చూడాలి.
