సునీల్ ఒకప్పుడు స్టార్ కమెడియన్. సునీల్ తనదైన శైలిలో చెప్పే కామెడీ పంచులు ఆడియన్స్ ని కడుపుబ్బా నవ్వించేవి. టాలీవుడ్ లో తిరుగులేని కమెడియన్ గా ఎదుగుతున్న సమయంలో సునీల్ హీరోగా మారాడు. ఆరంభంలో కొన్ని విజయాలు దక్కాయి. కానీ ఆ తర్వాతే పరిస్థితి పూర్తిగా మారిపోయింది. సునీల్ నటించిన చిత్రాలన్నీ బాక్సాఫీస్ వద్ద బోల్తా కొడుతూ వచ్చాయి. ఇక హీరోగా నిలదొక్కుకునే పరిస్థితి లేకపోవడంతో సునీల్ మళ్ళీ క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా మారాడు. 

ప్రస్తుతం సునీల్ కోసం దర్శకులు కామెడీ పాత్రలు సిద్ధం చేసుకుంటున్నారు. అరవింద సమేతలో సునీల్ మంచి రోల్ పోషించాడు. ఇలాంటి సమయంలో సునీల్ మరో రిస్క్ తీసుకోబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. గత ఏడాది బాలీవుడ్ లో విడుదలై ఘనవిజయం సాధించిన 'అంధాధున్' చిత్రంపై సునీల్ కన్నేశాడట. ఆయుష్మాన్ ఖురానా ప్రధాన పాత్రలో నటించిన ఈ చిత్రం మంచి విజయాన్ని అందుకుంది. 

ఈ చిత్రంలో ఆయుష్మాన్ అంధుడిగా నటించాడు. ఆ పాత్రలో సునీల్ నటించబోతున్నాడనే ప్రచారం జరుగుతోంది. హీరోగా మార్కెట్ పూర్తిగా పడిపోయిన సమయంలో అంధాధున్ చిత్రం సునీల్ కు ఏమేరకు కలసి వస్తుందో చూడాలి. అంధాధున్ రీమేక్ హక్కుల కోసం అన్ని భాషల్లో మంచి డిమాండ్ నెలకొని ఉంది. తమిళ రీమేక్ లో నటించడానికి ధనుష్, సిద్ధార్థ్ లాంటి హీరోలు ప్రయత్నిస్తున్నారు.