దాదాపు దశాబ్దానికి పైగా చిరంజీవి, పరుచూరి బ్రదర్స్ సైరా చిత్రం పట్టాలెక్కించడం కోసం ప్రయత్నిస్తున్నారు. అలాంటి సమయంలో బాహుబలి విడుదల కావడంతో పాన్ ఇండియా చిత్రాలకు ఓ దారి కనిపించింది. అదే సమయంలో దర్శకుడిగా సురేందర్ రెడ్డి ఒకే కావడంతో సైరా చిత్రం ప్రారంభమైనట్లు మెగాస్టార్ చిరంజీవి ప్రీరిలీజ్ వేడుకలో పేర్కొన్నారు. 

టీజర్, ట్రైలర్స్ తో సైరా చిత్రంపై మంచి బజ్ నెలకొని ఉంది. ప్రీరిలీజ్ వేడుకలో సైరా చిత్ర టైటిల్ సాంగ్ ని రిలీజ్ చేశారు. ఈ పాటలో మ్యూజిక్, సింగర్స్ గాత్రం, లిరిక్స్ ప్రతిఒక్కరికి రోమాలు నిక్కబొడుచుకునేలా చేశాయి. అమిత్ త్రివేది అద్భుతమైన సంగీతం అందించాడు. 

స్వాతంత్ర సమరయోధుడిని వర్ణిస్తూ పాట ఎలా ఉండాలో అలాంటి లిరిక్స్ నే సిరివెన్నెల సీతారామశాస్త్రి అందించారు. ఇక ఈ పాటని ప్రముఖ సింగర్స్ సునిధి చౌహన్, శ్రేయ గోషాల్ గాత్రం మరో స్థాయికి చేర్చాయి. వీళ్ళిద్దరూ అద్భుతంగా పాడారు. 

ఉయ్యాలవాడ గొప్పతనాన్ని వివరిస్తున్న సునిధి వాయిస్ పర్ఫెక్ట్ గా సెట్ అయిందని ఫ్యాన్స్ అంటున్నారు. ఇక శ్రేయ గోషాల్ సాంగ్ చివర్లో తన గాత్రంతో మ్యాజిక్ చేసింది. తాము సైరా టైటిల్ సాంగ్ ని రిపీట్ గా వింటున్నట్లు అభిమానులు సోషల్ మీడియాలో పేర్కొంటున్నారు.