తోటి హీరోలతో పోలిస్తే సందీప్ కిషన్ సక్సెస్ విషయంలో వెనుకబడ్డాడు. ఇక్కడ అవకాశాలు కూడా బాగా తగ్గాయి. దీంతో కోలివుడ్ కి వెళ్లి అక్కడ తన అదృష్టాన్ని పరీక్షించుకున్నాడు. కానీ వర్కవుట్ కాలేదు.

దీంతో మళ్లీ టాలీవుడ్ లోనే అవకాశాల కోసం ప్రయత్నిస్తూ హీరోగా బిజీ అవుతున్నాడు. ఇటీవల 'నిను వీడని నీడని నేనే' అనే సినిమా చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. దీనికి నిర్మాతగా సందీప్ కిషన్ వ్యవహరించడం విశేషం.

తాజాగా మరో సినిమాకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు ఈ హీరో.  'సుబ్రహ్మణ్యపురం' చిత్రంతో దర్శకుడిగా పరిచయమైన సంతోష్ జాగర్లపూడి దర్శకత్వంలో క్రీడా నేపధ్యంలో ఒక సినిమా చేయడానికి అంగీకరించాడు. భారతంలో తన బొమ్మను గురువుగా భావించి విద్య నేర్చుకున్న ఏకలవ్యుడి నుంచి బొటనవేలుగురుదక్షిణగా తీసుకున్నాడు ద్రోణాచార్యులు.

ఈ ఆధునికకాలంలో  అలాంటి ఒక గురువు ఎలాంటి గురుదక్షిణ అడిగాడు అనే ఉత్సుకత రేకెత్తించే కధాంశంతో సినిమాను రూపొందించబోతున్నారు. శ్రీనివాస్ బొగ్గరం నిర్మాతగా వ్యవహరించనున్న ఈ సినిమాకి సంబంధించిన పూర్తి వివరాలు త్వరలోనే తెలియనున్నాయి.