‘మళ్ళీ రావా..', 'సుబ్ర‌హ్మ‌ణ్య‌పురం', 'ఇదంజ‌గ‌త్‌’ వంటి విభిన్న  సినిమాలతో ఫామ్ లోకి వచ్చిన  సుమంత్ నటిస్తున్న తాజా చిత్రం ‘‘కపటధారి’’. గతేడాది కన్నడలో సూపర్ హిట్ అయిన ‘‘కావలుధారి’ చిత్రానికిది రీమేక్. విజయ్ ఆంటోని హీరోగా వచ్చిన ‘భేతాళుడు’ మూవీతో ఆకట్టుకున్న ప్రదీప్ కృష్ణమూర్తి డైరెక్ట్ చేస్తున్నాడు. క్రియేటివ్ ఎంట‌ర్‌టైనర్స్ అండ్ డిస్ట్రిబ్యూట‌ర్స్ బ్యాన‌ర్‌పై తెలుగు, త‌మిళ భాష‌ల్లో డా.ధ‌నంజ‌యన్ నిర్మిస్తున్నారు. శ్వేత నందిత (నందిత శ్వేత) హీరోయిన్ గా చేస్తున్న  ఈ చిత్ర టీజర్‌ను నటుడు రానా విడుదల చేశారు. 

‘ఈ ప్రపంచంలో ఏదీ ఊరికే జరగదు. అన్నింటికీ ఒక కారణం ఉంటుంది’ అంటూ ప్రారంభమైన టీజర్‌ ఇంట్రస్టింగ్ గా సాగింది. టీజర్‌ చివరలో వినిపించే ‘వాడి అసలు మొహం దాచుకోవడానికి వేషాలు మార్చే వ్యక్తి’ అంటూ హీరోను ఉద్దేశించి చెబుతున్న డైలాగ్‌తో పాటు టీజర్‌ బ్యాగ్రౌండ్‌లో వినిపిస్తున్న సాంగ్ ఆకట్టుకుంటోంది.

ఈ టీజర్ లో సుమంత్‌ పోలీస్‌ ఆఫీసర్‌గా కనిపించారు. ఓ కేసు ఇన్వెస్టిగేషన్‌ కోసం రంగంలోకి దిగిన సుమంత్‌కు ఎలాంటి అనుభవాలు ఎదురయ్యాయి? ఆ మిస్టరీ వెనుక ఎవరు ఉన్నారు? వేషాలు మార్చి కపటధారిగా ఉన్నది ఎవరు? తెలియాలంటే సినిమా చూడాల్సిందే. ఈ చిత్రానికి డా.ధ‌నుంజ‌య‌న్ స్క్రీన్‌ప్లే అడాప్ష‌న్ చేస్తుండ‌గా.. బాషాశ్రీ మాట‌లు, సైమన్ కె కింగ్ సంగీతమందిస్తున్నారు. ప్రస్తుతం సినిమా పోస్ట్‌ ప్రొడక్షన్‌ కార్యక్రమాలు జరుగుతున్నాయి.  ఈ చిత్రం త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుందీ చిత్రం.