--సూర్య ప్రకాష్ జోశ్యుల

అదేంటో అక్కినేని సుమంత్ కు ఆది నుంచీ కలిసిరాలేదు. 'సత్యం' తప్ప ఒక్కటీ సరైన హిట్ పడలేదు. వరస ఫ్లాఫ్ లతో సుమంత్ కు విసుగొచ్చిందో లేదో కానీ జనాలకు మాత్రం విరక్తి వచ్చేసింది. సుమంత్ సినిమాలకు కూడా డబ్బులు ఖర్చు పెట్టి ఏం వెళతాం అని దూరం పెట్టేసారు. అయితే ఆ మధ్యన వచ్చిన  'మళ్లీరావా' సినిమా టైటిల్ కు తగ్గట్లే అతన్ని కెరీర్ ని మళ్లీ వెనక్కి లాక్కొచ్చింది. 

సర్లే సెకండ్ ఇన్నింగ్స్ లో కాస్తంత మంచి సినిమాలు చేస్తున్నాడు అని జనం మళ్లీ ఆశగా తలెత్తి చూసారు. ఆ ఊపులో 'సుబ్రమణ్యపురం' టైటిల్ తో ఓ ట్రైలర్ వదిలాడు. ఆ ట్రైలర్ చూసిన వాళ్లు..అరే ఇది..నిఖిల్ చేసిన 'కార్తికేయ' కు కాపీలా ఉందన్నా...అని కామెంట్స్ చేసినా సినిమా చూసెయ్యాలని ఫిక్స్ అయ్యారు. ఆ క్రేజ్ ని ఎంతవరకూ సినిమా నిలబెట్టింది. సుమంత్ మరో హిట్ కొట్టినట్లేనా లేక మళ్లీ పాత రోజుల్లోకు వెళ్లిపోయాడా..కార్తికేయ సినిమాకు దీనికి నిజంగానే పోలిక ఉందా వంటి విషయాలు రివ్యూలో చూద్దాం.

కథేంటి: 

సుబ్రమణ్యపురం అనే గ్రామంలో ..వరసగా ఆత్మహత్యలు జరుగుతూంటాయి. ఆత్మహత్య జరగటానికి ముందు ఓ నెమలి వచ్చి సుబ్రమణ్య స్వామి గుడిపైన వాలుతూంటుంది. దాంతో అదంతా సుబ్రమణ్యడు లీల...ఆయన వల్లే ఇలా సూసైడ్స్ జరుగుతున్నాయనే నిర్ణయానికి అక్కడ వారు వచ్చేస్తారు. పోలీస్ (అమిత్ శర్మ) ఈ ఆత్మహత్యలకు కారణం ఏమిటో కనిపెడదామని ఇన్విస్టిగేషన్ ప్రారంభిస్తాడు. మరో ప్రక్క నాస్తికుడు కార్తిక్ (సుమంత్) పురాతన దేవాలయాలపై రీసెర్చ్ చేస్తూంటాడు. అతనికి ఈ సుబ్రమణ్యం దేవాలయం గురించి, అక్కడ జరిగే సూసైడ్స్ గురించి తెలుస్తుంది. దాంతో ఆసక్తి పెరగి..ఈ సూసైడ్స్ వెనక ఉన్న శక్తులను పట్టుకోవాలని, ఈ మిస్టరీ ని విడితీయాలని ఫిక్స్ అవుతాడు. అందుకోసం సుబ్రమణ్యపురం వస్తాడు. 

అతనికి తోడుగా గర్ల్ ఫ్రెండ్ ఈషా రెబ్బా వస్తుంది. ఈలోగా కార్తిక్ ని ఆ ఊరు విడిచి వెళ్లద్దని ఓ పిచ్చోడు (టీఎన్ ఆర్) హెచ్చరిస్తాడు.ఇది ఇలా ఉండగా.. ఓ వ్యక్తి (జబర్దస్త్ గెటప్ శీను) వేరే భాషలో రాయబడ్డ సూసైడ్ నోట్స్ ని డీకోడ్ చేయటానికి ప్రయత్నిస్తూంటాడు. ఇలా ఎవరి పనులో వాళ్లుంటారు. అయితే కార్తీక్ మాత్రం ఇదంతా దేవుడు కాదు..దెయ్యం పని కాదు...కేవలం ఎవరో కావాలని చేస్తున్నారు అని ఆ మిస్టరీని బ్రేక్ చేసేందుకు రెడీ అవుతాడు.  ఈలోగా కార్తిక్ ఫ్రెండ్ మేఘన చనిపోతుంది.

దాంతో పది రోజుల్లో ఈ మరణాల వెనక ఉన్న మిస్టరీ ఏంటో కనిపెడతానని ఆ ఊరి వాళ్ళతో ఛాలెంజ్ చేస్తారు. ఆ క్రమంలో అతనికి రకరకాల అనుభవాలు ఎదురవుతాయి... అప్పుడు ఓ షాకయ్యే నిజం బయిటపడుతుంది. అదేంటి ...నిజంగానే దైవ శక్తి అలా సూసైడ్స్ కు ఉసిగొల్పుతోందా..మరొకటా అనేది తెలియాలంటే సినిమా చూడాల్సిందే.

ఎలా ఉంది

కొన్ని కథలు పేపర్ మీద బాగుంటాయి. మరికొన్ని స్క్రీన్ మీద బాగుంటాయి. ఇది రెండో కోవకు చెందిన స్క్రిప్టు. పేపర్ మీద భలే ఉందే అనిపించిన ఈ కథ తెర మీదకు వచ్చేసరికి తేలిపోయింది. ఫస్టాఫ్ లో పేషెన్స్ కు పరీక్ష పెడితే..సెకండాఫ్ లో ఏకంగా స్కూలే పెట్టేసారు. ఎంతసేపున్నా కథ కదలకపోయేసరికి జనమే కదిలి బయిటకు వెళ్లిపోయే సిట్యువేషన్ వచ్చేసింది.

ముఖ్యంగా సినిమా మొత్తం సూసైడ్స్ తో నిండిపోయింది. ఒకరి తర్వాత మరొకరు ఆత్మహత్య చేసుకుంటూంటారు. అవే సీన్స్ రిపీట్ అవుతూంటాయి. స్క్రీన్ ప్లే ఎంత దారుణంగా ఉంటుందంటే ...ఆత్మహత్యలు సుబ్రమణ్యపురం అనే విలేజ్ లో జరుగుతున్నాయి అని చెప్పి..వాటిని ఆపటానికి ఒకడున్నాడు...అతనే సుమంత్ అని ఎస్టాబ్లిష్ చేసి, ఆ ఊరుకి పంపేసరికే ఇంటర్వెల్ వచ్చేసింది. 

ఇంటర్వెల్ టైమ్ లో బయిటకు వచ్చి ..ఏం చూసాము అని ఆలోచిస్తే..సూసైడ్స్..సుమంత్ ఎంట్రీ తప్ప అప్పటిదాకా జరిగిందేమో కనపడదు. ఇక సీన్స్ వరస చూస్తే సుబ్రమణ్యపురంలో ఓ సూసైడ్..సిటీలో సుమంత్ లవ్ స్టోరీ సీన్, మళ్లీ సూసైడ్..మరో లవ్ సీన్ ..ఇలా అక్కడో సీన్,ఇక్కడో సీన్ వేసుకుంటూపోయారు. అంతేకానీ ప్రేక్షకుడుకు ఇంట్రస్ట్ ఏముంటుంది...ఇలా చేస్తే అని ఆలోచించలేదు.

సర్లే ఆ సూసైడ్స్ ని ఆపటానికి సుమంత్ సెకండ్ పార్ట్ లో ఎలా ఫైట్ చేస్తాడో చూద్దామని లోపలకి వెళ్తే ...అంత సీన్ ఏమీ లేదని డైరక్టర్ వెక్కిరించినట్లుగా సీన్స్ వెళ్తూంటాయి. క్లైమాక్స్ ట్విస్ట్ అయితే ...తేలిపోయింది. కార్తికేయ ఫార్మెట్ నే ఫాలో అయినట్లు అర్దమైపోయేలా ఉంది. 

ఎలా చేసారు

కార్తీక్ గా సుమంత్ ...ఫరఫెక్ట్ గానీ అతనిలో నటుడుని బయటకు లాగే సరైన సీన్ ఒక్కటీ లేదు. ఈషా రెబ్బ..విలేజ్ అమ్మాయిగా బాగానే ఉంది కానీ..ఆమె పాత్ర ఏంటో అర్దాంతరంగా ఆగిపోయినట్లు అనిపిస్తుంది. సరిగ్గా డవలప్ చేయలేదు. ఆమె తండ్రి నరేద్రవర్మగా చేసిన నరేష్ కాస్తంత చెప్పుకోదగిన పాత్ర. మిగిలిన వాళ్లను గుర్తు పెట్టడం కూడా కష్టమే. జోష్ రవి ..ఫ్రెండ్ పాత్రలో బాగా చేసారు. సినిమాలో అతనికి చెప్పుకోదగ్గ పాత్ర. సినిమా బాగుంటే ...అతనికి మంచి పేరు తెచ్చి పెట్టేది. 

టెక్నికల్ గా ..

సినిమా ప్రారంభం రానా వాయిస్ ఓవర్ తో ప్రారంభమై సినిమాకు ఓ గంభీరమైన లుక్ తెచ్చింది. కానీ అది స్క్రీన్ టైమ్ గడిచే కొద్దీ ఆ ఎఫెక్ట్ కోల్పోయింది. సినిమాలో ఏ విభాగమూ అప్ టు ది మార్క్ లేదు. చాలా నాశిరకమైన నిర్మాణ విలువలు సినిమాని హోల్ సేల్ గా దెబ్బతీశాయి. 

 

ఫైనల్ థాట్

ట్రైలర్ చూసి టాలీవుడ్ ని ఏలేసే సినిమా అని అంచనా వేసి థియోటర్ కు వెళ్తే..అసలు మిస్టరీ రివీల్ అవుతుంది. ఆ ట్రైలర్ థియోటర్ దాకా రప్పించటానికి  మనకు వేసిన వల,ఎర అని అర్దమవుతుంది. ఆ విషయంలో ట్రైలర్ కట్ చేసినవాడు మాస్టర్ అని దణ్ణం పెట్టబుద్దేస్తుంది. 

ఎవరెవరు

నటీనటులు : సుమంత్ , ఈషా రెబ్బా, సీనియర్ నరేష్ తదితరులు.

సంగీతం : శేఖర్ చంద్ర

నిర్మాత : సుధాకర్ రెడ్డి

దర్శకత్వం : సంతోష్ జాగర్లపూడి

రేటింగ్ : 1/ 5

రిలీజ్ డేట్ : 7 డిసెంబర్ 2018