సుమంత్ అశ్విన్ శనివారం మీడియాతో ముచ్చటిస్తూ ఎమోషనల్ అయ్యారు. తండ్రి ఎంఎస్ రాజు గురించి భావోద్వేగ వ్యాఖ్యలు చేశారు.
మెగా మేకర్‌గా టాలీవుడ్‌లో పాపులారిటీని సొంతం చేసుకున్న ఎంఎస్ రాజుపై ఆయన తనయుడు సుమంత్ అశ్విన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. మళ్లీ జన్మంటూ ఉంటే ఆయనకే కొడుకు పుట్టాలని దేవుడిని కోరుకుంటానని తెలిపారు. ఆయన చేసిన ఎమోషనల్ కామెంట్స్ ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. ఎంఎస్ రాజు దర్శకుడిగా మారి వరుసగా సినిమాలు చేస్తున్నారు. ప్రస్తుతం ఆయన `7 డేస్ 6 నైట్స్` చిత్రాన్ని రూపొందించారు. సుమంత్ అశ్విన్ హీరోగా నటిస్తూ నిర్మించారు. ఈ చిత్రం జూన్ 24న విడుదల కానుంది.
ఈ నేపథ్యంలో సుమంత్ అశ్విన్ శనివారం మీడియాతో ముచ్చటిస్తూ ఎమోషనల్ అయ్యారు. తండ్రి ఎంఎస్ రాజు గురించి భావోద్వేగ వ్యాఖ్యలు చేశారు. `మరో జన్మంటూ ఉంటే, దేవుడు వచ్చి ఏం కావాలని అడిగితే 'మళ్ళీ హైదరాబాద్ లో ఎంఎస్ రాజు గారి అబ్బాయిలా పుట్టాలి' అని కోరుకుంటా. ఆయన ఎటువంటి ఫాదర్ అని నేను ఎప్పుడూ ఆలోచించలేదు. నాకు ఏది కావాలంటే నాన్న అది ఇచ్చారు. నాన్న పర్ఫెక్ట్ ఫాదర్. ఎన్ని జన్మలెత్తినా ఎంఎస్ రాజు దంపతుల కడుపున జన్మించాలని కోరుకుంటున్నా` అని తెలిపారు.
సుమంత్ ఇంకా చెబుతూ, `చిన్నప్పుడు, బాగా వెయిట్ ఉండేవాడిని. వెంకటేష్, ప్రభాస్, మహేష్ ఫిట్‌గా, హ్యాండ్సమ్‌గా ఉండేవారు. మంచి డ్రస్సులు వేసుకునేవారు. నేను వెయిట్ వల్ల అటువంటి డ్రస్సులు వేసుకోలేకపోయేవాడిని. షూటింగ్స్ చేసేటప్పుడు వాళ్ళను చూసి నేను అలా చేయలేనని అనుకున్నా. అప్పుడు సినిమాటోగ్రాఫర్ గానీ, డైరెక్టర్ కావాలనుకున్నా. 'వర్షం' సమయంలో నిక్సన్ మాస్టర్ పరిచయం అయ్యారు. ఆయన దగ్గర ఏరోబిక్, డ్యాన్సులో కొన్ని క్లాసులు తీసుకున్నా. అలా వెయిట్ తగ్గా. అప్పుడు నా ఫోటోలు చూసి త్రివిక్రమ్రు, ప్రభుదేవా `చాలా బావున్నాడు. బాడీ బిల్డ్ చేస్తే మంచి హీరో అవుతాడు` అని చెప్పారు. దీంతో ముంబై వెళ్లి యాక్టింగ్ కోర్స్ చేసి హీరో అయ్యానని తెలిపారు.
తాను నటించిన సినిమా గురించి చెబుతూ, `ఇప్పటివరకు నేను చేసిన సినిమాలతో కంపేర్ చేస్తే `7 డేస్ 6నైట్స్`లో రియాలిటీకి దగ్గరగా ఉండే డిఫరెంట్ రోల్ చేశా. నాకు కూడా వన్నాఫ్ ది బెస్ట్ రోల్. ఇప్పుడు ప్రేక్షకులు కూడా డిఫరెంట్ రోల్స్ యాక్సెప్ట్ చేస్తున్నారు. వాళ్ళకు రీచ్ అవ్వాలంటే మనం కూడా నెక్స్ట్ లెవెల్ థింగ్స్ చేయాలి. టైమ్ పట్టినా కొత్త రోల్స్ చేయాలనుకుంటున్నా` అని అన్నారు. `ఈ చిత్రంలో నేనొక నార్మల్ యంగ్‌స్టర్. ఫిల్మ్ మేకర్ అవ్వాలని అనుకుంటాడు. జీవితంలో తనకు చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి. స్ట్రగుల్ అవుతూ ఉంటాడు. ఎక్కువ స్మోక్ చేస్తాడు. వెయిట్ చేస్తాడు. తన మీద కేర్ తీసుకోడు. అటువంటి మనిషి ఎలా ఉంటాడో అదే తన పాత్ర` అని తెలిపారు.
ఎంఎస్ రాజు దర్శకత్వం చేయడంపై స్పందిస్తూ, `నాన్న ఇప్పుడొక ఫైర్ లో ఉన్నారు. ఎంఎస్ రాజు 2.0 అనుకోవచ్చు. 'డర్టీ హరి'తో ఆయన ప్రూవ్ చేసుకున్నారు. 'నువ్వొస్తానంటే నేనొద్దంటానా' తర్వాత మధ్యలో ఎక్కడో 'ప్రేక్షకులకు ఏం కావాలో అదే ఇవ్వాలి. సేఫ్ గేమ్, ఫ్యామిలీలు, టార్గెట్ ఆడియన్స్' అంటూ చేసిన సినిమాలు కథల పరంగా కొంత డిజప్పాయింట్ చేశాయి. అవన్నీ పక్కన పెట్టి నాన్న కంప్లీట్ అప్ గ్రేడ్ అయ్యి సినిమాలు చేస్తున్నారు. నాకు అది బాగా నచ్చింది. '7 డేస్ 6 నైట్స్'లో ఎంఎస్ రాజు మార్క్ ఉంటుంది. అదే సమయంలో 20 ఏళ్ళ దర్శకుడు తీసినట్టు ఉంటుంది` అని తెలిపారు.
అంతేకాదు, `నేను కాపీ చూసినప్పుడు నాతో పాటు మా అమ్మ, సిస్టర్ కూడా ఉన్నారు. మా ఇంట్లో సినిమా అని కాదు, చీప్‌గా ఉంటే వాళ్ళతో కలిసి చూడలేం. ఇబ్బంది పడే సన్నివేశాలు ఉండవు. నాకు బోల్డ్ అనే పదం నచ్చదు. యువత అడల్ట్ కంటెంట్ కోసం థియేటర్లకు రావాల్సిన అవసరం లేదు. ఎవరూ రారు కూడా! ఇంటర్నెట్‌లో బోలెడు కంటెంట్ ఉంది. కథ ఉంటేనే ఎవరైనా థియేటర్లకు వస్తార`ని తెలిపారు.
