తెలుగు చిత్ర పరిశ్రమలో ఈ రోజు (ఆగస్టు 1) నుంచి షూటింగ్స్ నిలిపేయాలని నిర్మాతలు నిర్ణయంపై తీసుకున్నారన్న విషయం తెలిసిందే. ఈ విషయంపై తాజాగా టాలీవుడ్ సీనియర్ నటుడు సుమన్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు.

అధిక వ్యయం భరించలేక నిర్మాతలు షూటింగ్స్ ను బంద్ చేయాలని నిర్ణయించిన విషయం తెలిసిందే. గత నెల 26న హైదరాబాద్ లోని అన్నపూర్ణ స్టూడియోలో ప్రొడ్యూసర్స్ గిల్డ్ నిర్వహించిన సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. ఈ సమావేశానికి టాలీవుడ్ స్టార్ ప్రొడ్యూసర్ దిల్‌రాజుతో పాటు ప్రముఖ నిర్మాతలు కూడా హాజరై మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా ఆగస్ట్ 1 నుంచి షూటింగ్‌లు బంద్ చేయాలని ఏకాభిప్రాయానికి వచ్చినట్టు తెలుస్తోంది. దీంతో ప్రస్తుతం శరవేగంగా రూపుదిద్దుకుంటున్న చిత్రాల పరుగులకు బ్రేకులు పడినట్టైయ్యింది. 

ఇదిలా ఉంటే.. ప్రొడ్యూసర్స్ గిల్డ్ తీసుకున్న నిర్ణయంపై తాజాగా టాలీవుడ్ సీనియర్ నటుడు సుమన్ (Suman) ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. ఈ రోజు విశాఖలో పర్యటించిన ఆయన నిర్మాతల ఏకాభిప్రాయంపై తన అభిప్రాయాన్ని వ్యక్తపరిచారు. వ్యయభారాలతో షూటింగ్ లు నిలిపేయడం, నిబంధనలు విధించడం సరికాదన్నారు. దీనివల్ల ఓటీటీలకు లాభమేనన్నారు. ఇండస్ట్రీలోని సమస్యలపై చర్చ జరిపేందుకు షూటింగ్ లు బంద్ చేయడం ఏంటని, హీరోల రెమ్యూనరేషన్ తగ్గించాలనడం ఏమాత్రం సరికాదని అభిప్రాయపడ్డారు. 

వీలైతే హీరోల నుంచి వేర్వేరు కాల్ షీట్స్ తీసుకోవాలని, సమయం ఎక్కడా వేస్ట్ కాకుండా షెడ్యూల్ ప్రియేర్ చేసుకోవాలన్నారు. అవసరమైతే రెండు రోజుల్లోని చిత్రీకరణను ఒక్కరోజే పూర్తి చేసేలా ప్లాన్ చేయాలని సూచించారు. అంతే గానీ రెమ్యూనరేషన్ తగ్గించాలనడం కరెక్ట్ కాదన్నారు. క్రేజ్ ఉన్నంత వరకే హీరోల డిమాండ్ ఉంటుందని, ఆ తర్వాత మామూలే కాదా అని తెలిపారు. గతంలో సినిమాలు ఉదయం ఏడు గంటల నుంచి సాయంత్రం ఏడు గంటల వరకు ఉండేది.. ఇప్పుడు ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం ఆరు గంటల వరకే చిత్రీకరణ కొనసాగుతోందన్నారు. ఇలాగైతే ఖర్చు పెరగదా అంటూ వ్యాఖ్యానించారు. రేట్స్ తగ్గించుకోవాలనే నిర్మాతలు బయ్యర్స్ ఎదుర్కొనే సమస్యలనూ గుర్తించాలన్నారు. సమస్యను పరిష్కరించుకునే దిశగా నిర్మాతలు అడుగులు వేయాలని కోరారు.