సుక్కూ...రివెంజ్ డ్రామాలనే నమ్ముకున్నాడా..?

Sukumar Again Revenge Drama With  Rangasthalam Movie
Highlights

సుక్కూ...రివెంజ్ డ్రామాలనే నమ్ముకున్నాడా..?

 

సుకుమార్ పేరు వినగానే ఆర్య ఆర్య 2 100 % లవ్... వంటి మంచి ఫీల్ గుడ్ ప్రేమ కథా చిత్రాలే గుర్తుకువస్తాయి. సున్నితమైన ప్రేమ కథలను అంత కంటే సున్నితంగా తెరకెక్కించి మనసును హత్తుకునేలా చేస్తాడు సుకుమార్. అయితే ఈ లెక్కల మాస్టారు ఇప్పుడు లెక్క మార్చి రివెంజ్ డ్రామాల మీద  మమకారం పెంచుకున్నట్టుగా కనిపిస్తోంది.

మహేష్బాబుతో ‘వన్- నేనొక్కడినే’ ఎన్టీఆర్తో ‘నాన్నకు ప్రేమతో...’ రామ్చరణ్తో ‘రంగస్థలం’... మూడింటి కాన్సెప్ట్ కూడా రివెంజ్ డ్రామానే. ‘వన్ నేనొక్కడినే’ సినిమాలో తల్లిదండ్రులను ఎందుకు చంపారో తెలుసుకుంటూ బయలుదేరుతాడు రాక్స్టార్ మహేష్. టేకింగ్ పరంగా సినిమా హాలీవుడ్ స్థాయిలో ఉన్నా సుక్కూ లెక్కలు సాధారణంగా ప్రజలకు ఎక్కలేదు. తర్వాత తారక్తో ‘నాన్నకు ప్రేమతో’ సినిమా చేశాడు సుకుమార్. టైటిల్ చూసి - తండ్రీ - కొడుకుల మధ్య ఉన్న అనుబంధాన్ని చూపిస్తాడని అనుకున్నారు. కానీ తండ్రికి జరిగిన మోసానికి ప్రతీకారం తీర్చుకునే పాత్రలో కనిపించాడు ఎన్ టీఆర్. సినిమా బాగానే ఆడినా - చాలామందికి సుకుమార్ టేకింగ్ అర్థం చేసుకోవడం చాలాకష్టంగా అనిపించింది అనేది నిజం. అందుకే క్లాస్ చిత్రంగా మిగిలిపోయిందా సినిమా. 

ఇప్పుడు రామ్ చరణ్ తో ‘రంగస్థలం’ తీశాడు. టైటిల్ - టీజర్ చూసి సుకుమార్ మళ్లీ ఓ మంచి ప్రేమకథను చూపిస్తున్నాడో అనుకున్నారంతా. గ్రామీణ నేపథ్యంలో 1985 నాటి రోజుల్లో పల్లెటూరి పరిమళాలు - ఆప్యాయతలు - అనురాగాలు మిళితమైన పూర్తి ఫీల్ గుడ్ లవ్ స్టోరీ చూడబోతున్నామని ఊహించుకున్నారు. కానీ కనిపించిన కథ వేరు. మళ్లీ రివెంజ్ డ్రామానే ఇతివృత్తంగా ఎంచుకున్నాడు సుక్కూ. అయితే ఈ సారి తండ్రి స్థానంలో అన్నయ్య వచ్చి చేరాడంతే. టేకింగ్ - నటీనటుల నటన పరంగా సినిమాకి మంచి మార్కులే పడుతున్నా ‘రంగస్థలం’ సినిమాలో కూడా రివెంజ్ డ్రామా అనేసరికి అందరూ స్టన్ అయ్యారు.

స్టార్ డమ్ లేని సమయంలో అల్లుఅర్జున్ - నాగచైతన్య వంటి హీరోలతో సినిమాలు చేసినప్పుడు ఫీల్ గుడ్ లవ్ స్టోరీలు చేసిన సుకుమార్ - స్టార్ హీరోలతో సినిమాలు అనగానే మరో ఆలోచన లేకుండా రివెంజ్ డ్రామానే ఎంచుకుంటున్నాడు.  ఎందుకంటే పెద్ద హీరోలైతే యాక్షన్ - ప్రతీకారం - రివెంజ్ వంటి మాస్ మసాలా అంశాలు లేకుంటే - జనాలు చూడరనే అపనమ్మకం కారణం కావచ్చు. సుక్కూ... ఈ రివెంజీలు బాగున్నాయ్.. కాని.. వీ వాంట్ సంథింగ్ క్రియేటివ్ సార్!

loader