`ఉప్పెన` సినిమాతో క్రేజీ హీరోయిన్‌గా మారింది కృతి శెట్టి. ఆమె ఇప్పుడు సుధీర్‌బాబుతో కలిసి ఓ సినిమాలో నటిస్తుంది. ఇంద్రగంటి మోహనకృష్ణ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమా టైటిల్‌ని సోమవారం సాయంత్రం విడుదల చేశారు. `ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి` అనే టైటిల్‌ని ఖరారు చేశారు. చిన్న వీడియోలో సుధీర్‌బాబు ఈ విషయం చెబుతూ తాజా టైటిల్‌ని ప్రకటించారు. ఇది చాలా ఇంట్రెస్టింగ్‌గా ఉంది. జనరల్‌గా ఇంద్రగంటి సినిమాలే డిఫరెంట్‌గా ఉంటాయి. డిఫరెంట్‌ టైటిల్స్ తో మ్యాజిక్‌ చేస్తారు. ఈ సినిమాతోనూ అదే చేయబోతున్నట్టు టైటిల్‌ని బట్టి అర్థమవుతుంది. 

ఇక ఇది ఇంద్రగంటితో సుధీర్‌బాబు నటిస్తున్న మూడో సినిమా. ఇప్పటికే `సమ్మోహనం`,  `వి` చిత్రాలు చేసిన విషయం తెలిసిందే. ఈ రెండూ మిశ్రమ స్పందనని రాబట్టుకున్నాయి. తాజా సినిమాతో హ్యాట్రిక్‌ కొట్టాలని భావిస్తున్నారు. ఇది సుధీర్‌బాబు 14వ సినిమా కావడం విశేషం. ఇక కృతి శెట్టికిది మూడో సినిమా. రెండో చిత్రం నానితో `శ్యామ్‌ సింగరాయ్‌` చేస్తుంది. మరోవైపు సుధీర్‌బాబు ఈ చిత్రంతోపాటు `శ్రీదేవి సోడా సెంటర్‌` అనే చిత్రంలోనూ నటిస్తున్నారు.