రామ్‌చరణ్ హీరోగా శంకర్‌ దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై నిర్మితమవుతోన్న ఈ సినిమాలో కన్నడ నటుడు కిచ్చా సుదీప్‌ అతిథి పాత్రలో నటించనున్నారనే వార్తలు వినిపిస్తున్నాయి. పాన్‌ ఇండియా చిత్రంగా తెరకెక్కనున్న ఈ చిత్రంలో బాలీవుడ్‌తో పాటు, తమిళ, కన్నడ చిత్రసీమకు చెందిన నటుల్ని ఇందులో నటింపజేయడానికి శంకర్ ఉత్సాహం చూపిస్తున్నాడని, అందుకు నిర్మాత దిల్ రాజు సై అంటున్నారని తెలుస్తోంది. ఇక ఈ సినిమాలో సుదీప్ పాత్ర ఏమిటిన్నది తెలియాల్సి ఉంది. నెగిటివ్ రోల్ లో సుదీప్ కనిపించబోతున్నాడని ఓ టాక్ రన్ అవుతోంది. ఎంతవరకూ నిజం అనేది తెలియాల్సి ఉంది. 

‘ఆర్‌సి 15’వర్కింగ్‌ టైటిల్‌తో తెరకెక్కుతున్న ఈ సినిమా జులై 15న సెట్స్ పైకి వెళ్లే అవకాశం ఉంది. ప్రముఖ నిర్మాత దిల్ రాజు నిర్మాణసారథ్యంలో తెరకెక్కనున్న ఈ సినిమా స్క్రిప్ట్‌ వర్క్‌, ప్రీ ప్రొడక్షన్‌ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. జూన్ లో ఈ సినిమా షూటింగ్ ప్రారంభం కానున్నట్టు వార్తలు వస్తున్నాయి. ఇదిలా ఉండగా ప్రస్తుతం రామ్ చరణ్ ఆర్ఆర్ఆర్, ఆచార్య సినిమాల షూటింగ్ లతో బిజీగా ఉన్నారు. ఈ సినిమాలకు సంబంధించిన షూటింగ్ లను జూన్ లోగా పూర్తి చేసి , శంకర్ సినిమాలో నటించేందుకు రామ్ చరణ్ సన్నాహాలు చేసుకుంటున్నట్టు సమాచారం.

సుదీప్‌ గతంలో రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన ‘ఈగ’లో విలన్ గా నటించి మెప్పించారు. తర్వాత ‘బాహుబలి’లోనూ గెస్ట్ రోల్ లో కనిపించి సందడి చేశారు. ఇక చిరంజీవి నటించిన ‘సైరా నరసింహారెడ్డి’లో అవుకు రాజుగా కనిపించారు. కిచ్చా సుదీప్‌ ప్రస్తుతం ‘విక్రాంత్‌ రోనా’ చిత్రంలో కథానాయకుడిగా నటిస్తున్నారు. ఉపేంద్ర  హీరోగా నటిస్తున్న ‘కబ్జా’ చిత్రంలో భార్గవ్‌ బక్షిగా కీలక పాత్ర పోషిస్తున్నారు. ఇప్పటికే పలు హిందీ సినిమాల్లోనూ నటించి ఆకట్టుకున్నారు.