ఈ శుక్రవారం నాడు మూడు సినిమాలు బాక్సాఫీస్ వద్ద సందడి చేయబోతున్నాయి. అవేంటంటే.. సుమంత్ 'సుబ్రమణ్యంపురం', సందీప్ కిషన్ 'నెక్స్ట్ ఏంటి..?' అలానే బెల్లంకొండ శ్రీనివాస్ నటించిన 'కవచం'. వీటితో పాటు మరికొన్ని చిన్న సినిమాలు విడుదల కాబోతున్నాయి. అయితే ప్రేక్షకులకు మాత్రం ఈ మూడు సినిమాలపైనే దృష్టి పడింది. హీరోగా తన కెరీర్ క్లోజ్ అనుకున్న సమయంలో 'మళ్లీ రావా' సినిమాలో నటించి హిట్ అందుకున్నాడు సుమంత్.

తాజాగా 'సుబ్రమణ్యంపురం' అనే సైకలాజికల్ థ్రిల్లర్ తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ఒక ఊరిలో ఉండే గుడి, అక్కడ జరిగే కొన్ని ఊహించని పరిణామాలు.. వాటిని చేధించే వ్యక్తి పాత్రలో సుమంత్ కనిపించనున్నాడు. సినిమా ట్రైలర్ ఆసక్తిగా ఉన్నప్పటికీ గతంలో నిఖిల్ నటించిన 'కార్తికేయ' సినిమాను తలపిస్తుందనే కామెంట్స్ వినిపిస్తున్నాయి.

ఇక సందీప్ కిషన్ కి ఈ మధ్య కాలంలో ఒక్క హిట్టు కూడా లేదు. అసలు తన ఆఖరి సినిమా ఎప్పుడు విడుదలైందో కూడా ప్రేక్షకులకు గుర్తు ఉండి ఉండదు. తాజాగా అతడు బాలీవుడ్ దర్శకుడుకునాల్ కోహ్లి నటించి 'నెక్స్ట్ ఏంటి..?' అనే సినిమాలో నటించాడు. ఈ సినిమాలో తమన్నా నటించడం, తన గ్లామర్ తో ట్రైలర్ మరింత అందంగా ఉండడంతో సినిమాపై ఆసక్తి పెరిగింది.

యూత్ లో ఈ సినిమాపై మంచి అంచనాలే ఏర్పడ్డాయి. ఎప్పటినుండో ఓ కమర్షియల్ ఇండస్ట్రీ హిట్ కోసం చూస్తున్నాడు బెల్లంకొండ శ్రీనివాస్. భారీ బడ్జెట్ కమర్షియల్  సినిమాలలో నటిస్తోన్న తను అనుకున్న సక్సెస్ ని మాత్రం అందుకోలేకపోతున్నాడు. ఈ శుక్రవారం తన 'కవచం' సినిమాతో మరోసారి బాక్సాఫీస్ వద్ద సందడి చేయనున్నాడు. మరి ఈ ముగ్గురు హీరోల్లో ఎవరు సక్సెస్ అందుకుంటారో చూడాలి!